ప్రధాని ఓలిని బహిష్కరించిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ 

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలిని అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ) బహిష్కరించింది. ఆ పార్టీ చీలిక వర్గానికి చెందిన కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమై కేపీ శర్మ ఓలిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు పార్టీ చీలిక వర్గం నేత నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు.

అధికార కమ్యూనిస్ట్‌ పార్టీలో తనపట్ల వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలి గత ఏడాది డిసెంబర్‌ 20న నేపాల్‌ పార్లమెంట్‌ను రద్దు చేశారు. అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి దీనిని ఆమోదించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలో ఆ దేశ జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వరకు ఆయన తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు.

మరోవైపు కేపీ శర్మ ఓలి పార్లమెంట్‌ను రద్దు చేయడంపై అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ రెండుగా చీలింది. ఓ వర్గం ఆయనపై తీవ్రంగా మండిపడింది. పార్లమెంట్‌ రద్దు అనంతరం ఆ నేతలు శుక్రవారం రెండోసారి భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నుంచి ఓలిని బహిష్కరించాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన రెబల్‌ గ్రూప్‌ కేంద్ర కమిటీ సమావేశంలో ఓలిని పార్టీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించడంతోపాటు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలో సభ్యుడిగా కొనసాగే అర్హత ఓలికి లేదని అందుకే పార్టీ నుంచి తొలగించినట్లు రెబల్‌ నేత మాధవ్‌ కుమార్‌ తెలిపారు. పార్టీ ఆయన మోకాళ్ల దగ్గర తల ఒగ్గి ఉండదని, ఎవరికీ కూడా అలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా, త్వరలో జరుగనున్న నేపాల్‌ జాతీయ ఎన్నికల్లో పార్టీ చిహ్నమైన సుర్యుడి గుర్తు ఏ వర్గానికి దక్కుతుందో అన్నది అన్నది ఆ దేశ ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.