పీఆర్సీపై నెలాఖరులోగా తేల్చకపోతే ఉద్యమం

ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా తేల్చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ కేసీఆర్ ప్రభుత్వంకు అల్టిమేటం ఇచ్చింది. లేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, 65ు ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

ఇందిరాపార్క్‌‌ ధర్నాచౌక్‌‌లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన  చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది.నెలాఖరులోపు అన్ని సంఘాలతో చర్చలు జరిపి, వేతన సవరణపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వేదికలోని భాగస్వామ్య సంఘాలకు చెందిన స్టీరింగ్‌ కమిటీ సభ్యులు శనివారం తలపెట్టిన ఒకరోజు నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు.  

దీక్షకు అనుమతి లేదంటూ ఇందిరా పార్కు(ధర్నా చౌక్‌) వద్దకు వారు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఐక్యవేదిక సభ్యులు రోడ్డుమీదే బైఠాయించి ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతసేపటి తర్వాత ఆందోళన చేస్తున్న 50 మంది ఐక్యవేదిక సభ్యులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. 

ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఇందిరాపార్కు వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా వంద మందితో నిరాహార దీక్ష చేస్తామని చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.

పోలీసులు చూపుతున్న అత్యుత్సాహం ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా ఉందని ధ్వజమెత్తారు. ఉద్యమాల ద్వారా వచ్చిన ప్రభుత్వం ఉద్యమాలను అడ్డుకోవడం తగదని హెచ్చరించారు. వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గతపర్చాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులను తక్షణమే చర్చలకు పిలవాలని కోరారు.

మరోవంక, పోలీసుల అరెస్టుకు నిరసనగా రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొమ్మిది లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు  పీఆర్సీ, డీఏల సాధనకు ఐక్యవేదిక పోరాటం చేస్తోందని ప్రకటించారు.

రాష్ట్ర  ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులను అడ్డుపెట్టుకొని సమయం వృద్దా ‌ చేస్తూ అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ఇకనైనా స్పందించి పీఆర్సీ, డీఏ ప్రకటించాలని డిమాండ్ చేశారు.