కరీంనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

కరీంనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ముఖ్యమంత్రిపై బిజెపి రాష్ట్ర డీయక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న విమర్శలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను తెలంగాణ చౌక్‌లో దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
విషయం తెలిసిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి  ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను వారించే ప్రయత్నం చేశారు.
ఇరుపార్టీల నేతలు రోడ్డుకు రెండు వైపుల బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా,  అక్రమంగా అరెస్టు చేసి, బలవంతంగా వాహనాల్లోకి నెట్టి, కుక్కారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  
ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించిన కరీంనగర్ టూ టౌన్ సీఐ అక్ష్మీబాబు తోపులాటలో కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడినట్లుగా సమాచారం.