ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు మృతి  

వీఎంసీ (విజయ మారుతి క్రియేటివ్స్) ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత వి. దొరస్వామి రాజు ఈ రోజు ఉదయం గుండెపోటుతో  కన్నుమూసారు. ఈయన నిర్మాతగా కాకుండా వీఎంసీ డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసారు. 1978 లో విఎంసి సంస్థను ఎన్టీ రామారావు చేతులమీదుగా ప్రారంభించారు, 
 
 కొన్ని రోజుల నుండి వయో భారంతో దొరస్వామిరాజు  ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.  1994లో నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు సభ్యునిగా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు.
 
గురుశిష్యులు, జానకి రాముడు, ప్రేమాభిషేకం వంటి దాదాపు 750 చిత్రాలను పంపిణి చేసారు. అంతేకాదు సినీ రంగంలో రాయలసీమ రారాజుగా పేరుపొందారు.  సినీ రంగంలో  పంపిణీదారుడిగా  మొదలైన దొరస్వామి రాజు.. ఆ తరవాత వియంసీ ప్రొడక్షన్‌ బ్యానర్ లో తొలిసారి  కృష్ణంరాజు, నాగార్జున హీరోలుగా తెరకెక్కిన ‘కిరాయిదాదా’ సినిమాతో నిర్మాతగా మారారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 
 
ఆ తర్వాత ఈయన అక్కినేని నాగేశ్వరరావు, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగార్జున, మీనా హీరో, హీరోయిన్లుగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. 
 
ఆ తర్వాత ‘మాధవయ్య గారి మనవడు’, అన్నమయ్య’ సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత వెంగమాంబ, శ్రీ వాసవీ వైభవం, విజేత వంటి చిత్రాలను నిర్మించారు. వి.దొరస్వామి రాజు ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జులతో చెరో మూడు చిత్రాలను నిర్మించారు.