విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు

విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు
వినాయకుని విగ్రహానికి మలినం పూసిన కేసులో టీడీపీ నాయకుడిని రాజమహేంద్రవరం రురల్ మండలంలో  బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి కథనం ప్రకారం పిడింగొయ్యి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వల్లేపల్లి ప్రసాద్‌బాబు ఎలియాస్‌ బాబూఖాన్‌ చౌదరికి స్థానిక వెంకటగిరి ప్రాంతంలో ఇల్లు ఉంది. దానికి వీధి శూల ఉండడంతో ఇంటి గేటు వద్ద వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. 
 
ఆ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు మలినం పూశారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని బాబూఖాన్‌ చౌదరి గత ఏడాది సెప్టెంబర్‌ 12న విస్తృతంగా ప్రచారం చేశారు.  దీనిపై బాబూఖాన్‌ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.
వినాయక విగ్రహానికి మలినం పూసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, తప్పుడు ప్రచారం చేసింది బాబూఖాన్‌చౌదరేనని నిర్ధారించారు. దీంతో గురువారం రాత్రి అతడిని అరెస్టు చేసి, శుక్రవారం ఉదయం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. అతడికి 15 రోజులు రిమాండ్‌ విధించి, కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన స్థానిక టిడిపి, బీజేపీ నేతలపై కూడా కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి తెలిపారు.