పొరుగు దేశాలకు 2 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు 

 తొలి దఫాలో పొరుగు దేశాలకు 2 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయాలని భారత్‌ యోచిస్తున్నది. దీని కోసం విధి, విధానాలను సిద్ధం చేస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మన దగ్గరి నుంచి టీకా డోసులను తీసుకోనున్న దేశాల జాబితాలో నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌, సేషెల్స్‌, మారిషస్‌ ఉన్నాయి. 
 
సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ఒకటి ఈ టీకాలను కొనుగోలు చేసి ఆ తర్వాత పంపిణీ చేస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని డోసులను ఉచితంగానే సరఫరా చేయబోతున్నదని అయితే ఇంకా పంపిణీపై అంతిమ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి. 
దేశంలో కొవిడ్‌-19 టీకాల లభ్యత, ఉత్పత్తికి పట్టే సమయం తదితర అంశాలను అంచనా వేశాకనే విదేశాలకు వ్యాక్సిన్‌ డోసుల పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఇదంతా పూర్తికావడానికి కొంచం సమయం పడుతుందని చెప్పారు. భారత్‌లోని సీరమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ డోసుల సేకరణ కోసం బ్రెజిల్‌ ఓ విమానాన్ని పంపించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.