ఇన్‌స్టెంట్‌ లోన్ దందాలో చైనీయుల హస్తం

మన దేశంలో వెలుగులోకి వచ్చిన తక్షణ రుణాల (ఇన్‌స్టెంట్‌ లోన్‌) దందాలో చైనీయుల హస్తం ఉందని, అసలు సూత్రధారులు వారేనని రాచకొండ పోలీసులు గుర్తించారు. మొత్తం దందాను చైనా, హాంకాంగ్‌ నుంచి, భారత్‌లో ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు తేల్చారు. 

ఈ కేసుకు సంబంధించి ముంబైలో ఇద్దరిని అరెస్టు చేస్తే అందులో మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు చైనీయులు నియమించిన అధికార ప్రతినిధి కూడా ఉన్నాడు. తక్షణ రుణాల దందాకు హెడ్‌గా వ్యవహరిస్తున్న చైనా వ్యక్తి హి. జియాన్‌ అలియాస్‌ మార్క్స్‌, అతడికి సహకరిస్తున్న బినామీ డైరెక్టర్‌ వివేక్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.28 కోట్టను ఫ్రీజ్‌ చేశామని  రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ వెల్లడించారు. గత డిసెంబరు 27న పుణెలోని జియా లియాంగ్‌ ఇన్‌ఫోటెక్‌ కాల్‌సెంటర్‌పై రాచకొండ పోలీసులు దాడులు నిర్వహిచారు. కాల్‌ సెంటర్‌ నిర్వాహకుడు పరుశరామ్‌ లాహూ టేక్‌వేతో పాటు అతడి భార్య చైనా మహిళ లియాంగ్‌ టియాన్‌ టియాన్‌, హెచ్‌ ఆర్‌ మేనేజర్‌ అఖిబ్‌ షేఖ్‌లను అరెస్టు చేశారు.

వీరిని విచారించిన పోలీసులకు ముంబై కేంద్రంగా ఇన్‌స్టంట్‌ దారుణ దందా నిర్వహిస్తున్న మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల గుట్టు తెలిసింది. మరిన్ని సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు  ముంబై వెళ్లారు.  థానేలో అజయ్‌ సొల్యూషన్స్‌, బినీస్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌, ఇపోచ్‌ గో క్రెడిట్‌ సొల్యూషన్స్‌, త్రుతీగ్‌ ఫైన్‌టెక్‌ ప్రై.లి కంపెనీలు ఇన్‌స్టంట్‌ దారుణ దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

వీటిలో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఈ కంపెనీలకు హెడ్‌గా వ్యవహరిస్తోంది చైనాకు చెందిన హి.జియాన్‌ అలియాస్‌ మార్క్స్‌గా నిర్థారించారు. ముంబైలో అతడికి సహకరిస్తోంది అజయ్‌ సొల్యూషన్స్‌లో అకౌంటెంట్‌గా వ్యవహరిస్తున్న వివేక్‌ కుమార్‌గా గుర్తించారు.

ముంబైలో ఉన్న 4 కంపెనీలు 24 యాప్‌ల ద్వారా ఈ దారుణ దందా నిర్వహిస్తున్నట్లు  నిర్థారించారు. ఏ ఒక్క కంపెనీకి కూడా ఎన్‌బీఎ్‌ఫసీ గుర్తింపుగానీ, ఆర్‌బీఐలో అనుమతులు గానీ లేవని తేల్చారు. పూర్తిగా చట్ట వ్యతిరేకంగా తక్షణ రుణ దందాకు తెరతీసినట్లు సీపీ వెల్లడించారు.  కాగా చైనాలో ఉంటూ భారత్‌లో అక్రమ దారుణ దందా కొనసాగిస్తోంది సూనాన్‌, సూ జింగ్‌చాంగ్‌, జియావో కియోలుగా తెలిసింది.