వైసిపి నేతలను తరిమి, తరిమి కొట్టాలి!

రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి అమ్మఒడి ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు ఆరోపించారు. సోమవారం తిరుపతి తూర్పు మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటూ  లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమి తరిమి కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలు, దోచేయడం, దౌర్జన్యాలు చేయడం ఇదే వైసీపీ నేతల దినచర్య అని తూర్పార పట్టారు.

జగన్ కేబినె‌ట్‌లో హోంమంత్రి సుచరిత కీలుబొమ్మలా మారారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చే నిధులేనని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో వైసీపీ నేతలు కమీషన్లు నొక్కేస్తున్నారని ఆరోపించారు.

ఇంటి పట్టాల కోసం భూసేకరణలో మూడు వేల కోట్ల అనినీతి చోటు చేసుకుందని విమర్శించారు. ‘‘అభివృద్థి మాదే – ఓటు అడిగే హక్కు మాదే’’నని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు వైసీపీ, టీడీపీకి లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర చేసే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. రామతీర్ధం నుంచి రామ రథయాత్ర పేరుతో చేపట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఆలయాలు, విగ్రహాల పై దాడులు వంటి అంశాలపై యాత్రలో బీజేపీ నేతలు ప్రసంగించనున్నారు. 

ఈ రథయాత్రలో బీజేపీ జాతీయ నాయకులను భాగస్వాములు చేయనున్నట్టు తెలుస్తోంది. విగ్రహాలపై దాడులు జరిగిన ప్రాంతాల్లో రథయాత్ర నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై చర్చించేందుకు ఈ నెల 17న వైజాగ్‌లో బీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది.