అందరూ మహిళా పైలట్లతో సుదూర ప్రయాణం  

భారత విమానయాన చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ప్రపంచానికి చెరో కొసన ఉన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తొలి ఎయిరిండియా విమానాన్ని అందరూ మహిళా పైలట్లే నడపనున్నారు. ‘ప్రపంచంలో ఎయిరిండియా అత్యంత దూరం నడపనున్న తొలి వాణిజ్య విమానం ఇదే.  ‘ఎయిరిండియా మహిళా శక్తి ప్రపంచాన్ని చుట్టి రానుంద’ని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ ట్విట్టర్‌లో ప్రశంసించారు. 

కమాండింగ్‌ ఫ్లైట్‌గా కెప్టెన్‌ జోయా అగర్వాల్‌ నేతృత్వంలోని మహిళా పైలట్ల బృందం(కెప్టెన్‌ పాపగరి తన్మయి, కెప్టెన్‌ ఆకాంక్ష సోనావానే, కెప్టెన్‌ శివాని మన్‌హస్‌) శాన్‌ప్రాన్సిస్‌కో లో బయల్దేరి బెంగళూరుకు చేరుకోనుంది.  ‘‘ఎయిర్‌ ఇండియా నడుపుతున్న అత్యంత సుదూర కమర్షియల్‌ విమానం ఇదే. గాలి వేగాన్ని బట్టి ఈ మార్గంలో మొత్తం ప్రయాణ సమయం 17 గంటలకు పైగా ఉంటుంది’’ అని ఆ సంస్థ పేర్కొంది.

ప్రపంచంలో అతిపొడవైన ఎయిర్‌ రూట్‌ నార్త్‌పోల్‌ మీదుగా ప్రయాణించి విమానరంగంలో తమ సత్తాను చాటనున్నారు.   238 సీట్ల సామర్థ్యమున్న ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. ఈ రెండు నగరాల మధ్య దూరం 13,993 కిలో మీటర్లు. టైమ్‌ జోన్‌లో మార్పు 13.5 గంటలు ఉంటుందని ఎయిర్‌ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. 

16 వేల కిలోమీటర్ల అతి సుదీర్ఘమార్గంలో ఎక్కడా ఆగకుండా ఏఐ 176 విమానం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి శనివారం రాత్రి 8.30 (స్థానిక కాలమానం) గంటకు బయలుదేరి సోమవారం ఉదయం 3.45 గంటలకు (స్థానిక కాలమానం) బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. కాగా జనవరి 15 నుంచి హైదరాబాద్‌, చికాగో మధ్య తొలి నాన్‌స్టాప్‌ సర్వీసును కూడా ప్రారంభించాలని ఎయిర్‌ ఇండియా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

దీనిపై కెప్టెన్‌ జోయా అగర్వాల్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలామంది తమ  జీవితకాలంలో ఉత్తరధ్రువాన్ని చూడలేరు. పౌర విమానాయాన మంత్రిత్వశాఖ తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞలు తెలిపారు. మొత్తం మహిళా సభ్యులతో జరుగుతున్న ఈ ప్రయాణం తమకెంతో గర్వంగా ఉందని చెప్పారు.