ఎన్‌డిఆర్‌ఎఫ్‌లోకి తొలిసారిగా మహిళలు

దేశ విపత్తు నిర్వహణా బృందం ఎన్‌డిఆర్‌ఎఫ్‌లోకి తొలిసారిగా మహిళలు ప్రవేశించారు. వంద మందికి పైగా మహిళా సహాయక సిబ్బందితో మొదటి బ్యాచ్‌ రూపొందింది. కొత్తగా శిక్షణ పొందిన తొలి మహిళల బృందాన్ని ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఘర్‌ ముక్తేశ్వర్‌ పట్టణంలోని గంగా నదీ తీరంలో విధుల నిమిత్తం మోహరించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

యుపి ప్రభుత్వ కోరిన నేపథ్యంలో వెంటనే మహిళల బృందాన్ని అక్కడకు పంపామని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రదాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రెస్క్యూ బోట్లను, సహాయ పరికరాలను ఈ బృందం ఉపయోగిస్తుంది. పూర్తిస్థాయి సహాయకులుగా వీరు అన్ని రంగాల్లో ఆరితేరారని ఆయన చెప్పారు. 

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందంలోకి మహిళలను తీసుకోవాలన్న ఆలోచన గత కొంతకాలంగా వుంది. దశాబ్ద కాలం క్రితం తలెత్తిన ఈ ఆలోచన ఇప్పటికి సాకారమైంది. గత కొద్ది మాసాల్లో వంద మందికి పైగా మహిళలు ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో చేరారు. త్వరలోనే వీరిని దేశవ్యాప్తంగా పలు బెటాలియన్లలో చేర్చనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సంఖ్య 200కి చేరే అవకాశం వుందన్నారు.