సీసీ కెమెరాల ఏర్పాటులో రెండో స్థానంలో హైదరాబాద్  

ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం.  యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్‌’సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. 

‘‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం’’అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది 

2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్‌  నిలిచింది. 

ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత.  గతేడాది 4,490 కేసుల్లో నేరస్థుల్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరించడం గమనార్హం.  

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పం అని డిజిపి డా. ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిల్లో 2020లోనే 99,095 అమర్చామని చెప్పారు.

 సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా… హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది.   చదరపు కిలోమీటరుకు 657 కెమెరాలతో చెన్నై మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 480 కెమెరాలతో హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది.