అమెరికన్‌ కాంగ్రెస్‌ ట్రంప్ కు గట్టి షాక్‌   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆయనకు గట్టి షాక్‌ ఇచ్చింది. ట్రంప్‌ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రంప్‌ హయాంలో అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిరాజని ఒక బిల్లు చట్ట రూపం దాల్చడం ఇదే తొలిసారి. 

రిపబ్లికన్‌ పార్టీకి బలం ఉన్న కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌ కూడా ట్రంప్‌ అధికారాన్ని పక్కకు పెట్టి  నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డీఏఏ)ని 81–13 ఓట్ల తేడాతో ఆమోదించడం గమనార్హం.  ఈ పరిణామంతో అధికారానికి దూరమవుతున్న క్షణాల్లో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్‌కి ఎదురు దెబ్బ తగిలిట్టనయింది.

ఈ వారం మొదట్లోనే ప్రతినిధుల సభ ఈ బిల్లుని 322–87 ఓట్లతో ఆమోదించింది. ట్రంప్‌ రక్షణ బిల్లుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు దేశ భద్రతకు భంగకరంగా ఉన్నాయన్నది ఆయన వాదన. కానీ అమెరికా ప్రజాప్రతినిధులు మాత్రం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేశారు.

సాధారణంగా కాంగ్రెస్‌లోని రెండు సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని వినియోగించి బిల్లుని తిప్పి పంపడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు బిల్లుని వీటో చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్‌ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లుని చట్టంగా మార్చే అవకాశం ఉంది.

ట్రంప్‌ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్‌లో ఉభయ సభలు ఆయన సంతకం అవసరం లేకుండానే బిల్లుని ఆమోదించాయి. దేశ భద్రత, మిలటరీ అవసరాలు, సైనిక కుటుంబాలకు అండగా ఉండడానికి కావల్సిన నిధులను మంజూరు చేసే బిల్లు  కావడంతో కాంగ్రెస్‌ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆమోదించింది.