చివరికి గుళ్లో దేవుడికీ రక్షణ లేకుండా పోయింది 

ఆంధ్ర ప్రదేశ్ లో  సామాన్య ప్రజలకు రక్షణ లేకపోగా.. చివరికి గుళ్లో దేవుడికీ రక్షణ లేకుండా పోయిందని  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో  సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహ ధ్వంసం ఘటనపై శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 
 
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ అలసత్వం వల్లే ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నాయి. విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో మాయమైన మూడు వెండి సింహాలను ఇంతవరకూ గుర్తించలేదు. అంతర్వేదిలో రఽథం తగలబెట్టిన నిందితులను ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
 రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకొంది? అని చంద్రబాబు ప్రశ్నించారు. మొదటిసారి దాడి జరిగినప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇన్ని ఘటనలు జరిగేవి కావు. వరుస దాడులు జరుగుతున్నా జగన్‌ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటూ నిలదీశారు. 
 
ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ ధర్మానికి, సంప్రదాయాలకు కళ్లెం పడుతోందని ధ్వజమెత్తారు. దేశంలోనే ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
 
కాగా, విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండరామ స్వామి ఆలయాన్ని చంద్రబాబు  శనివారం సందర్శించనున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని రాముని విగ్రహం తల నరికివేసిన ఘటన ఇటీవల సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. చంద్రబాబు శనివారం ఉదయం 9 గంటలకు గన్నవరం నుంచి  విశాఖకు విమానంలో వెళ్లి తర్వాత రోడ్డు మార్గంలో 12 గంటలకు రామతీర్థం ఆలయానికి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.