కరోనా వైరస్ ఆయుర్వేదంతో చెక్‌  

కరోనా వైరస్‌ను ఆయుర్వేదంతో చెక్‌పెట్టేందుకు భారత్‌ యత్నిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న కేరళ ఆయుర్వేద ఫార్ములా సామర్థ్యాన్ని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సిసిఎంబి) పరీక్షించనుంది. 

ఈ మేరకు సిసిఎంబి కేరళ కొట్టక్కల్‌లోని ఆర్యవైద్యశాల (ఎవిఎస్‌)తో ఒప్పందం చేసుకుంది. 118 ఏళ్ల పురాతన సంస్థ అయిన ఈ ఆర్యవైద్యశాల ఆయుర్వేద చికిత్సను అందిస్తుంది. ఈ సంస్థ 500కు పైగా ఆయుర్వేద ప్రామాణిక సూత్రీకరణలను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. 

వీటిలో కొన్ని ఫార్మూలాలు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ఎవిఎస్‌ గుర్తించింది. దీంతో వాటిని సిసిఎంబి ప్రయోగశాలలో పరీక్షించనున్నారు. ఈ పరిశోధనల ద్వారా స్పష్టమైన ఫలితాలు వెల్లడైతే.. భారత్‌లోని ఔషధ పరిశ్రమలు కరోనాపై కీలక పురోగతిని సాధించవచ్చని సిసిఎంబి భావిస్తోంది. 

కాగా, పురాతన గ్రంథాల్లోని ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఇటిప్పటివరకు ఎలాంటి ప్రోటోకాల్స్‌ లేవు. కరోనా వైరస్‌పై పనిచేసే ఔషధాలను ప్రజలకు ఇచ్చే ముందు వాటిపై పరీక్షలు జరపడం అత్యవసరమని భావిస్తున్నారు.

తమ ప్రయోగశాలలో కరోనాపై ఔషధాలు పనిచేస్తాయో లేదో పరీక్షించే సామర్థ్యం ఉందని సిసిఎంబి డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా పేర్కొన్నారు. కాగా, ఆధునిక సైన్స్‌తో ఆయుర్వే శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ధ్రువీకరిచేందుకు సిసిఎంబితో భాగస్వామ్యమయ్యామని ఎవిఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సి.టి.సులేమాన్‌ తెలిపారు