బిజెపి  టచ్ లో 30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  

బిజెపి  టచ్ లో 30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  
30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తన టచ్ లో  ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.  పైగా, గెలిచిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కూడా బీజేపీలోకి వస్తామని అంటున్నారని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలసిన బండి సంజయ్ జిహెచ్‌ఎంసీ నూతన కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని తమిళిసైను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు.
ఈ విషయంలో తమ  విధానం స్పష్టంగా ఉన్నదని పేర్కొంటూ ఇతర పార్టీలతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించవద్దని ఆగుతున్నామని చెప్పారు.
 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని,  బల్దియా ఎన్నిక జరిగి నెల గడిచినా ఇంకా గెజిట్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎంఐఎం సహకారం లేకుంటే హైదరాబార్‌లో టీఆర్‌ఎస్‌ ఇన్ని సీట్లు కూడా గెలిచేది కాదని ఎద్దేవా చేశారు.  ముందస్తుగా ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు.