అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్చి విషయంలో ఆదివారం రాత్రి వెలగపూడి ఎస్సీ కాలనీలో రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ వర్గానికి చెందిన మొండం మరియమ్మ అలియాస్ బుజ్జి(55) మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం మృతదేహంతో ధర్నాకు దిగారు.
సమీప గ్రామాల నుంచి కూడా పెద్దసంఖ్యలో వారి వర్గీయులు వెలగపూడికి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసి హోంమంత్రి సుచరిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తాడికొండ, వేమూరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున గ్రామానికి వచ్చి మరియమ్మ కుటుంసభ్యులను పరామర్శించారు.
ఈ క్రమంలో హోంమంత్రితో పాటు వచ్చిన సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాపట్ల ఎంపీ సురేష్‌ను వెంటబెట్టుకొచ్చినందుకు హోంమంత్రి కూడా వెనక్కి వెళ్లాలని నినాదాలు చేశారు.అసలు గొడవకు కారణమైన ఎంపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కాల్ డేటా చెక్ చేస్తే దాడి వెనుక ఎవరున్నారో తెలుస్తుందంటూ కేకలు వేశారు.
కాలనీలోని దాడి జరిగే ముందు వారు ఎంపీని కలిశారని ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చిన భరోసాతోనే తమపై రాళ్ల దాడికి దిగారని ఆరోపించారు. మరియమ్మ మృతికి నందిగం సురేషే కారణమని ఆరోపించారు. ఆయన బాపట్లలో ఉండకుండా ఇక్కడ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ తమలో తమకు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
తనకు ఓటేసిన వారిలో కూడా తన, మన తేడా లేకుండా రెండు వర్గాలు చీల్చి తగాదా పెడుతున్నారంటూ ఎంపీతో పాటు ఎమ్మెల్యే శ్రీదేవి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ ధర్మేంద్రబాబు తమను భయపెట్టాలని చూస్తున్నారని, ఈ సంఘటనలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. వైసీపీకి ఓట్లు వేసి కావాలని గెలిపించుకున్నందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నామని హోంమంత్రి ఎదుట వాపోయారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండు చేశారు. న్యాయం చేస్తానని సుచరిత హామీ ఇచ్చారు.
ఆదివారం రాత్రి 11 గంటలకు జరిగిన దాడిలో మరియమ్మ చనిపోతే.. 24 గంటలు దాటినా కేసు నమోదు చేయక పోవడం దారుణమంటూ దళిత నేతలు జడ శ్రావణ్ కుమార్, మేళం భాగ్యారావు నేతృత్వంలో దళిత సంఘాలు వెలగపూడిలో రోడ్డుపై ధర్నాకు దిగాయి. సీఎం క్యాంప్ కార్యాలయం వద్దే తేల్చుకుంటామంటూ మృతదేహంతో దళత సంఘాలు బయల్దేరాయి. వారిని వెలగపూడి సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపైనే బైఠాయించి అర్ధరాత్రి వరకు ధర్నాకు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడికి కారణమైన 29 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఏ-1గా ఎంపీ సురేష్‌పై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఆ మేరకు ఎఫ్‌ఐఆర్ కాపీ వచ్చే దాక కదిలేది లేదని భీష్మించారు. కలెక్టర్, ఎస్పీలు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు.
కాగా, వెలగపూడి రాళ్ల దాడి ఘటనపై సమగ్ర విచారణకు అదేశించినట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. మరియమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మృతురాలి కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఈ ఘటనలో పోలీసుల పాత్ర ఉంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఒకే కాలనీలోని వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడం.. ఒకరు మృతి చెందడంతో వెలగపూడి ఎస్సీ కాలనీలో వాతావరణం నివురు గప్పిన నిప్పులా మారింది. హోం మంత్రి వచ్చి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చినప్పటికి పరిస్థితిలో మార్పు రాలేదు. తమ వర్గానికి చెందిన మహిళను పొట్టన పెట్టుకున్నారని, అందుకు తగిన గుణపాఠం చెపుతామని ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాలనీలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ పికెట్ కొనసాగిస్తున్నారు.
More Stories
అమరావతి పాత టెండర్లు రద్దు
2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
అనకాపల్లి వద్ద రూ 1.40 కోట్లతో ఉక్కు కర్మాగారం