సంజయ్‌ రౌత్‌ భార్యకు ఈడీ సమన్లు 

పీఎంసీ బ్యాంక్‌ నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి శివసేన కీలక నేత,  ఎంపీ సంజయ్ రౌత్  భార్య వర్షా రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో డిసెంబర్‌ 29న విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి. 
 
తొలి రెండుసార్లు అనారోగ్య కారణాలు చూపుతూ ఆమె విచారణకు హాజరుకాలేదు. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లో రుణ కుంభకోణంపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు పవన్‌ రౌత్‌ భార్యకు, వర్షా రౌత్‌కు మధ్య 50 లక్షల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ మొత్తాన్ని వర్షా రౌత్‌ ఆస్తి కొనుగోలు కోసం వినియోగించినట్లు తెలుస్తున్నది. 
 
 ఇక ఎవరికైనా ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేస్తే, వారు స్పందించపోతే సదరు వ్యక్తులపై లీగల్‌ యాక్షన్‌ తీసుకునే అధికారం ఈడీకి ఉంటుంది. శివసేన రెండు నాల్కల ధోరణిని విడిచిపెట్టి  ఈ ఆరోపణలపై స్పందించాలని,  వాస్తవాలను ప్రజలకు బహిరంగపర్చాలని  ఈ సందర్భంగా బిజెపి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల చర్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని తెలిపారు.