ఓఎల్‌ఎక్స్‌లో జరుగుతున్న మోసాలపై జాగ్రత్త  

ఓఎల్‌ఎక్స్‌లో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హితవు చెప్పారు. ఓఎల్‌ఎక్స్‌లో జరుగుతున్న మోసాల పట్ల ఉండాల్సిన అప్రమత్తతపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఆవిష్కరిస్తూ సెకండ హ్యాండ్ వస్తువుల విక్రయం పేరుతో ఆన్‌లైన్ నేరస్థులు ఓఎల్‌ఎక్స్‌ను అడ్డాగా చేసుకుని మోసం చేస్తున్నారని హెచ్చరించారు.

సైబర్ నేరస్థులు దీనిని అడ్డాగా చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగులమని, ఆర్మీ అధికారులమని చెబుతూ, నకిలీ ఐడికార్డుల, యూనిఫాంతో దిగిన ఫోటోలు అప్‌లోడ్ చేస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. విలువైన కార్లు, బైక్‌లు, మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు.

కొంతమంది ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన చాలామంది మోసపోయిన ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదని తెలిపారు. సైబర్ నేరాలు, ముఖ్యంగా ఓఎల్‌ఎక్స్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదేని ఫిర్యాదు కోసం డయల్ 100, 9490617444కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఓఎల్‌ఎక్స్‌పై సూచనలు

1. వస్తువులను ప్రత్యక్షంగా చూడకుండా సోషల్ మీడియా వేదికల్లో ప్రకటనలు చూసి నమ్మొద్దు.
2. వస్తువును విక్రయించే అసలు యజమానులు ధరను ఖచ్చితంగా చెబుతారు. సైబర్ నేరస్థులు ఇచ్చే ప్రకటనల్లో వస్తువులకు అసలైన ధర ఉండదు.
3. వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు.
4. వస్తువులను కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా అసలైన వెబ్‌సైట్లనే ఎంపిక చేసుకోండి.
5. నగదు వాపసు వస్తుందంటే నమ్మి డబ్బులు ఇవ్వకూడదు.
6. గుర్తుతెలియని వ్యక్తులు ఓఎల్‌ఎక్స్ ప్రకటనలకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు.
7. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి.
8. ఓఎల్‌ఎక్స్ వేదికగా ఆర్మీ అధికారులు, పోలీసు అధికారులమని చెప్పి ఇచ్చే ప్రకటనలు చూసి నమ్మి మోసపోవద్దు, వాటిని 9. ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. కేవలం ఫొటోల ద్వారా కొనుగోలు చేస్తే మోసపోతారు.
10. ప్రకటనలో ఉన్న వివరాలను బయట సరిచూసుకోవాలి.
11. మిలటరీ, ఇతర పారామిలటరీ అధికారులమంటూ పెట్టే ఫొటోలను అసలు నమ్మొద్దు.
12. అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు.
13. ప్రత్యక్షంగా కలవండి, పత్రాలను స్వయంగా పరిశీలించాలి.