విజయన్ కు కేరళ గవర్నర్ మోకాలడ్డు!

నూతన వ్యవసాయ చట్టాలపై అసెంబ్లీలో చర్చించి, వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు సిద్ధమవుతున్న కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ మొకాలడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు ఆయన మంగళవారం అనుమతి నిరాకరించారు. కేంద్రం తీసుకు వచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ఈ నెల 23న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించింది. అయితే ఈ సమావేశం ఆవశ్యకతపై గవర్నర్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 

గవర్నర్ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి పునరాయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీని సమావేశ పరచే అంశం గవర్నర్ విచక్షణ అధికారంలోకి రాదనీ, అసెంబ్లీలో మెజారిటీ గల మంత్రివర్గం నిర్ణయంకు లోబడి ఉంటుందని చెప్పారు. 

గవర్నర్‌ నిర్ణయం అసహజంగానూ, నమ్మలేని విధంగా ఉందని అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ విమర్శించారు. గవర్నర్‌ చర్య రాజ్యాంగ విరుద్ధమని సిఎం విజయన్‌ పేర్కొన్నారు. స్పష్టమైన మెజార్జీ ఉన్న ఫ్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించే హక్కు గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు.

అయితే గవర్నర్ నిర్ణయాన్ని బిజెపి స్వాగతించింది. పార్లమెంట్ ఆమోదించిన తీర్మానాలను చర్చించి, వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం `రాజ్యాంగ వ్యతిరేకం’  అంటూ విమర్శించింది. సిపిఎం, సీఎం విజయన్ చావుకబారు ప్రచారం కోసమే అసెంబ్లీ సమావేశం కోరుకొంటున్నారని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. 

అయితే గవర్నర్ బిజెపి ప్రతినిధివలె వ్యవహరిస్తున్నార్నయి కాంగ్రెస్ ఉప నాయకుడు కేసి జోసెఫ్ ధ్వజమెత్తారు. కొందరు రైతులు `వ్యతిరేకిస్తున్న’ దృష్ట్యా వ్యవసాయ చట్టాల గురించి అసెంబ్లీలో చర్చింప దలచిన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొనగా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు `సంఘీభావం’ తెలుపుతూ ఆర్ధిక మంత్రి థామస్ ఇజాక్ ట్వీట్ చేశారు.