జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత జరిగిన డీడీసీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికరణ 370ని రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.
దీంతో ఆశావాదం, ప్రజాస్వామ్యం గెలిచినట్లు బీజేపీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో అత్యధిక ఓట్లు తమ పార్టీకి, స్వతంత్రులకు లభించాయని, గుప్కర్ అలయెన్స్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పేర్కొంది.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ బుధవారం మాట్లాడుతూ, డీడీసీ (జిల్లా అభివృద్ధి మండలి) ఎన్నికల ఫలితాలనుబట్టి ఆశావాదం, ప్రజాస్వామ్యం గెలిచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీరులో ఏకైక అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, గుప్‌కర్ అలయెన్స్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తర్వాతి స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (67), పీడీపీ (27), కాంగ్రెస్ (26) ఉన్నాయని పేర్కొన్నారు.
కొన్ని పార్టీలు బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనలేక గుప్‌కర్ అలయెన్స్‌గా జట్టు కట్టాయని ధ్వజమెత్తారు. అయినప్పటికీ బీజేపీకి 4.87 లక్షల ఓట్లు లభించాయని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 2.82 లక్షల ఓట్లు, పీడీపీకి 57 వేల ఓట్లు, కాంగ్రెస్‌కు 1.39 లక్షల ఓట్లు లభించినట్లు తెలిపారు. ఈ మూడు పార్టీలకు లభించిన మొత్తం ఓట్ల కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు లభించాయని గుర్తు చేశారు. బీజేపీకి కశ్మీరు లోయలో స్థానాలు దక్కడం ఇదే తొలిసారి అని చెప్పారు.
జమ్మూ-కశ్మీరు డీడీసీ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, కాంగ్రెస్, పీడీపీలకు లభించిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చాయని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు తిరస్కరించిన మెహబూబా ముఫ్తీ పార్టీకి నేడు దీటైన జవాబు లభించిందని స్పష్టం చేశారు.
కశ్మీరు లోయలో మూడు స్థానాలను బీజేపీ దక్కించుకోవడానికి కారణాలను వివరిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై జమ్మూ-కశ్మీరు ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. మోదీ విధానాలను, ప్రజాస్వామిక సిద్ధాంతాలను బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్న కృషిని ప్రజలు సమర్థిస్తున్నారని తెలిపారు.
జమ్మూ-కశ్మీరులో 280 స్థానాలకు జరిగిన ఎన్నికలు డిసెంబరు 19తో ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 75 స్థానాలను దక్కించుకుంది. గుప్కర్ అలయెన్స్‌కు 112 స్థానాలు లభించాయి.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి
మతమార్పిడులు, ఫాస్టర్లను అడ్డుకోవడం `రాజ్యాంగ వ్యతిరేకం కాదు’