ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కు క‌రోనా పాజిటివ్‌

ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది.  త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపింది. కోవిడ్‌-19 పాజిటివ్ గా తేలిందని ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేస్తున్నా. సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను. నేను క్షేమంగానే ఉన్నాను. నేను త్వ‌ర‌లో షూటింగ్‌లో జాయిన్ కావాల్సింది.ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది..అంటూ పోస్ట్ లో పేర్కొంది.
 
త‌న‌తో ఎవ‌రెవ‌రూ కాంటాక్టులోకి వ‌చ్చారో, స‌న్నిహితంగా మెదిలారో ముందు జాగ్ర‌త్త‌గా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సుర‌క్షితంగా ఉండాల‌ని కోరింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్ తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ఇటీవ‌లే ర‌కుల్ మాల్దీవులు వెకేష‌న్ టూర్ లో స‌ర‌దాగా ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే.
మరోవంక, యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా  బ్రిటన్ నుంచి కర్ణాటక వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తెలిపారు. 
కోవిడ్-19 కట్టడికి కేంద్రం సూచించిన అన్ని మార్గదర్శకాలను తాము పాటిస్తున్నామని యడియూరప్ప స్పష్టం చేశారు. యూకే నుంచి ఎవరు వచ్చినా వారికి తప్పనిసరిగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు  
 
కాగా,  భారత్‌లో కొత్త వైరస్‌ ప్రభావం ఇప్పటి వరకు లేదని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది.కరోనా కొత్త వైరస్‌ 75 శాతం వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని పేర్కొంది. కొత్త వైరస్ జినోమ్ వ్యవస్థను అధ్యయనం చేస్తామని కేంద్ర వైద్యశాఖ పేర్కొంది. అనేక దేశాల్లో కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయన్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను నిషేధించామని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది.
 
ఇలా ఉండగా, దేశంలో రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గిపోతూ.. వైర‌స్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తున్న‌ది. మంగ‌ళ‌వారం ఉద‌యానికి గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 19,556 కొత్త కేసులు న‌మోదుకాగా 30,376 మంది రిక‌వ‌రీ అయ్యారు. 
 
దీంతో దేశంలో ప్ర‌స్తుతం మిగిలి ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల దిగువ‌కు వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఉద‌యానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 2,92,518గా ఉన్న‌ది.