`డబుల్ స్టిక్కర్’  ప్రభుత్వం జగన్ సర్కార్ 

`డబుల్ స్టిక్కర్’  ప్రభుత్వం జగన్ సర్కార్ 

రాష్ట్రంలో అప్పులు, అవినీతి చేయడంలో ముందంజలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డబుల్ స్టిక్కర్ ప్రభుత్వంగా మారిపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను పేరు మార్చి ఈ  ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు.

అప్పుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలిపారని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి వందకు 51 శాతం ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వమిత్ర (ప్రాపర్టీ కార్ట్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పత్రంగా పేరు మార్చి అమలు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అవాస్తవమని చెప్పుకొచ్చారు.ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలుకు ఏడు వేల కోట్లు ఖర్చుచేశామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, మిగిలిన మూడు వేల కోట్లు పక్కదారి మల్లించారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్ల‌ నిధులను రాష్ట్రానికి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో రూ.12 వేల కోట్ల సబ్సిడీ నష్టపోయిందని వీర్రాజు పేర్కొన్నారు. రూ.22వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం  సబ్సిడీ ఇస్తోందని ఆయన చెప్పారు.

108, 104 పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తే మోదీ బొమ్మ బదులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మెకానిజేషన్ కోసం ఎంఎస్‌ఎఫ్‌డిసి నిధులు కేటాయిస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకొని థాంక్యూ సీఎం అని ప్రచారం చేసుకున్నారని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.