బీజేపీలో చేరిన నేతను ఎన్నుకున్న కాంగ్రెస్!

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎంతటి దుస్థితిలో ఉన్నదో తెలిపే సంఘటన ఒకటి తాజాగా మధ్య ప్రదేశ్ లో జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికలలో తమ పార్టీని ఎప్పుడో వదిలి, బీజేపీలో చేరిన నేతను ఎన్నుకున్నట్లు ప్రకటించడమే కాకుండా, శుభాకాంక్షలు కూడా తెలిపి నవ్వులపాలయింది. 
 
విష‌యం తెలిసిన వెంట‌నే ఆయ‌న ఎన్నిక‌ను ర‌ద్దు చేసినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆ పార్టీ నాయకత్వం అదుపులో లేవని స్పష్టం అయింది. గ‌త మార్చి నెల‌లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ప‌లువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. 
 
వారిలో హ‌ర్షిత్ సింఘాయ్ కూడా ఒక‌రు. ఈయ‌న ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. కానీ గ‌త శుక్ర‌వారం యువజన  కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నికైనందుకు శుభాకాంక్ష‌లు అంటూ త‌న‌కు సందేశాలు రావ‌డం చూసి ఆయ‌న కంగుతిన్నారు. ఈ ఎన్నిక‌ల్లో సింఘాయ్ 12 ఓట్ల తేడాతో గెలుపొందిన్నట్లు ప్రకటించారు.
మూడేళ్ళ క్రితం దాఖలు చేసిన నామినేషన్ ఆధారంగా, తొమ్మిది నెలల క్రితమే పార్టీని వదిలి వెళ్ళిపోయినా చూసుకోకుండా ఆయన పేరుతో సహా ఎన్నిక జరపడం, ఆయన పార్టీలో ఉన్నారో లేదో చూడకుండా పార్టీ సభ్యులు ఓటు కూడా వేయడం విస్మయం కలిగిస్తుంది. “ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ ఆస‌క్తి లేదు. అయినా నేను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌య్యాను. మార్చి 10వ తేదీన నేను కాంగ్రెస్ పార్టీని వీడాను. చివ‌రిసారి నేను మూడేళ్ల కింద‌టే యువజన  కాంగ్రెస్ ఎన్నిక‌ల్లో పోటీ చేశాను” అని సింఘాయ్ చెప్పారు.
మూడేళ్ల కింద‌ట తాను నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించాన‌ని, త‌ర్వాత రెండుసార్లు వాయిదా ప‌డిన ఎన్నిక‌లు ఇప్పుడు జ‌రిగాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ మ‌ధ్య‌లో తాను నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు పార్టీకి చెప్పినా పైనుంచి ఎలాంటి స్పంద‌నా లేద‌ని సింఘాయ్‌ వాపోయారు.