‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ విచారణపై సుప్రీం స్టే!

ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేల్చుతామంటూ హైకోర్టు జరుపుతున్న విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులు తనను ఆందోళనకు గురి చేశాయని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో తదుపరి విచారణపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. 

అక్రమ నిర్బంధం, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేల్చుతామని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టింది. 

ఈ విచారణ నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. పిటిషన్‌లో ప్రతివాది అయిన రెడ్డి గోవిందరావు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూహెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లను, ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ ఉత్తర్వులనూ వేర్వేరుగా చూడాలని కోరారు. అలా కాదని, ఆ రెండూ ఒకటేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘రాజ్యాంగ విచ్ఛిన్నం’తోపాటు దీనితో ముడిపడిన అన్ని పిటిషన్లపై విచారణను నిలిపివేసింది. అయితే, హెబియస్‌ కార్ప్‌సలపై విచారణ జరపడంపై తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తుషార్‌ మెహతా స్పష్టం చేశారు. పలుమార్లు లూథ్రా ఏదో చెప్పబోవడంతో ‘మీ విజ్ఞప్తి ఏమిటో స్పష్టంగా చెప్పండి’ అని ధర్మాసనం ఆదేశించింది. 

ఈ నెల 14వ తేదీన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగిందని ఆయన తెలిపారు. రాజ్యాంగ విచ్ఛిన్నం ఉత్తర్వులను వెనక్కి తీసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ లూథ్రా చేసిన వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 

ఒక దశలో  ‘‘మీరు ఎన్నేళ్లుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు? ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా?’’ అని లూథ్రాను ప్రశ్నించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందనే అభిప్రాయానికి రావడానికి హైకోర్టు జడ్జిని ఏ అంశం ప్రభావితం చేసిందనుకుంటున్నారని ప్రశ్నించింది. ‘‘రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ విచ్ఛిన్నమైందని భావిస్తే హైకోర్టు ఈ ఉత్తర్వులు ఎలా జారీ చేసింది’’ అని వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ దీనిపై శీతాకాల శెలవుల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.