బీజేపీ సునామీ ప్రారంభం… టిఎంసిలో మిగిలేది మమత ఒక్కరే

బీజేపీ సునామీ ప్రారంభం… టిఎంసిలో మిగిలేది మమత ఒక్కరే

బెంగాల్‌లో బీజేపీ సునామీ ప్రారంభమైందని, ఆ సునామీలో సీఎం మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరపడ్డ నాటికి తృణమూల్ కాంగ్రెస్‌లో ఒక్క మమతా బెనర్జీ మాత్రమే మిగులుతారని ఆయన ఎద్దేవా చేశారు.

సీఎం మమతా బెనర్జీ చేస్తోన్న అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి కారణంగానే ఒక్కొక్కరు తృణమూల్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని షా తీవ్రంగా ఆరోపించారు. త్వరలో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నిఅలలో 200 సీట్లను గెల్చుకొని బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సభలోనే తృణమూల్ కీలక నేత సుబేందు అధికారి బీజేపీలో చేరారు. ఈయనతో పాటు ఓ ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 

‘‘ఇది అంతం కాదు… ఇది ప్రారంభమే… ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి… పార్టీలో మీరొక్కరే ఉంటారు దీదీ….’’ అని అమిత్‌షా సంచనల ప్రకటన చేశారు. మూడు దశాబ్దాలు పాలించమని కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, 10 ఏళ్లు కమ్యూనిస్టులకు, 5 ఏళ్లు తృణమూల్‌కు అధికారం ఇచ్చారని.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన బెంగాల్ ప్రజలను అభ్యర్థించారు. 

ఐదేళ్లు అవకాశమిస్తే బెంగాల్‌ను ‘‘బంగారు బెంగాల్‌’’ గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నేతలను బీజేపీ నేతలు తమ పార్టీలోకి తీసుకుంటున్నారని సీఎం మమతా ఆరోపిస్తున్నారని, ఆమె కాంగ్రెస్ ను వీడి తృణమూల్‌ పెట్టారని అది ఫిరాయింపు కాదా? అని షా సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో 200 సీట్లు సాధించి, బెంగాల్‌ను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సీఎం మమతకు వ్యతిరేకంగా బెంగాల్ బెంగాలే ఏకమవుతోందని, బెంగాల్ లో నెలకొన్న సమస్యలను మోదీ చూసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్ పరిస్థితులను మార్చడానికే చాలా మంది బీజేపీలో చేరుతున్నారని, దీనికి మమత ఎందుకు గాబరా పడుతుందో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.  

 అవినీతిని రాష్ట్రం నుంచి పారద్రోలుతానని మమత హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుత పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయని షా విమర్శించారు. చాలా మంది నేరస్తులను మమత కాపాడుతున్నారని షా ఆరోపించారు. వరద సహాయ నిధులను కేంద్రం కేటాయిస్తే, వాటిని కూడా తృణమూల్ గూండాలు తమ జేబుల్లో వేసుకున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ పై రాళ్లదాడికి దిగారని, బీజేపీకి చెందిన 300 మంది కార్యకర్తలను క్రూరంగా హత్య చేశారని… అయినా తాము తృణమూల్‌కు భయపడే ప్రసక్తే లేదని అమిత్‌షా తేల్చి చెప్పారు.