జనవరి 15 నుంచి శ్రీ రామ్ మందిర్ నిధి సమర్పణ్ 

అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం కోసం వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ‘శ్రీ రామ్ మందిర్ నిధి సమర్పణ్ డ్రైవ్ చేపట్టనున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సెక్రటరీ జనరల్ చంపత్ రాయ్ వెల్లడించారు.
అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి జన్మస్థలంలో నిర్మించబోయే గొప్ప ఆలయానికి దేశం నలుమూలల నుంచి ప్రతీ రామ భక్తుడి మద్ధతును కోరనున్నారు. విరాళాల సేకరణ కోసం విశ్వ హిందూ పరిషత్ క్రియాశీల కార్యకర్తలు, సాధువులు ఇంటింటికీ వెళతారు.
రాబోయే మకర సంక్రాంతి (జనవరి 15, 2021) నుంచి మాగపూర్ణిమ వరకు విస్తృతమైన ప్రచారంలో భాగంగా వీహెచ్‌పీ కార్యకర్తలు దేశంలోని 4,00,000 గ్రామాలకు చెందిన 110 మిలియన్ల కుటుంబాల వద్దకు చేరుకుంటారు. సామాన్య ప్రజలను నేరుగా శ్రీ రామజన్మభూమితో అనుసంధానించడం లక్ష్యంగా రామాలయం కోసం విరాళాలు సేకరిస్తామని చంపత్ రాయ్ పేర్కొన్నారు.
రామాలయం కోసం పోరాడిన అసంఖ్యాక హిందువులకు చంపత్ రాయ్ వందనం చేశారు. రామభక్తులు విరాళాల సేకరణ కోసం ముందుకు రావాలని రాయ్ పిలుపునిచ్చారు. రామాలయం రాతి దిమ్మెలతో మూడు అంతస్తులుగా ఉంటుందని, దీని పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుందని రాయ్ తెలిపారు.
రామాలయం సాహిత్యాన్ని వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రజలకు అందజేయనున్నారు. రామాలయ నిర్మాణ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచడానికి ట్రస్టు  రూ 10, రూ 100, రూ 1,000 విలువగల కూపన్లు, రశీదులను ముద్రించింది.