తిరిగి బీజేపీ గూటికి చేరిన రాజస్థాన్ సీనియర్ నేత

రాజస్థాన్‌కు చెందిన సీనియర్ నేత ఘన్‌శ్యామ్ తివారీ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర రాష్ట్ర నాయకత్వాలతో విభేదాల నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆయన పార్టీని వీడారు. తాజాగా, తిరిగి పార్టీలోకి రావడం కప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఘన్‌శ్యామ్ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత ఈ వేదికపై నుంచి మాట్లాడే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. 

పార్టీలో చేరిక కోసం రాసిన లేఖను పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను బీజేపీ భావజాలానికి పూర్తి కట్టుబడి ఉన్నట్టు చెప్పిన ఆయన, ఒకసారి కాంగ్రెస్‌తో వేదికను పంచుకున్నప్పటికీ దాని సభ్యత్వాన్ని తాను ఎప్పుడూ అంగీకరించలేదని స్పష్టం చేశారు.

తాను బీజేపీతోనే ఉన్నానని, అయితే, కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా కొత్త పార్టీ ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజేతో మనస్పర్థల కారణంగా పార్టీని వీడిన ఘన్‌శ్యామ్ ఆ తర్వాత ‘భారత్ వాహిని పార్టీ’ని స్థాపించారు. సంగనెర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.