పదో తేదీ దాటినా ఇంకా జీతాలు ఇవ్వకపోవడంతో తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అయితే పది రోజులకే జీతాలు రాకపోతే ఆందోళన వద్దని, కొన్ని రాష్ట్రాలలో నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా జీతాలు చెల్లించకపోవడాన్ని ఎస్‌డబ్ల్యూఎస్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఖండించింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మండిపడ్డారు. మేనేజ్‌మెంట్ వెంటనే జీతాలు చెల్లించాలని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కమాల్ రెడ్డి కోరారు.
రాష్ట్ర ఖజానా నుంచి ఆర్టీసీ సంస్థకు డబ్బులు రావడం లేదని మంత్రి పువ్వాడ చెప్పారు. జీతాలు ఆలస్యం కావడంపై ఆందోళన అవసరం లేదని అంటూ మహారాష్ట్ర ఆర్టీసీలో 5 నెలలుగా, కర్నాటకలో 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. జీతాల విషయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కర్నాటక, మహారాష్ట్ర గురించి చెబుతున్నారని, ఏపీ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హితవు చెప్పారు.
గురువారం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో తొలి దశలో భాగంగా హైదరాబాద్‌లో పార్సిల్, కొరియర్ హోం డెలివరీ సర్వీసులను మంత్రి ప్రారంభిస్తూ ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే మంచి కబురు చెబుతామని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుకు మంచి ఆదరణ వస్తోందని, వీటి ద్వారా రోజుకు రూ. 15లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని చెబుతూ రానున్న రోజుల్లో రూ.25లక్షలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ సెంటర్ల వారీగా విభజించి హోం డెలివరీ చేస్తామని వెల్లడించారు.
ఆర్టీసీ ఆదాయం క్రమక్రమంగా పెరుగుతోందని, రోజుకు రూ. 10 కోట్లు, 65 శాతం ఓఆర్ నమోదవుతోందని తెలిపారు. కరోనాకు ముందు 75 శాతం ఆర్ ఉండేదని చెప్పారు. హైదరాబాద్‌లోని కొన్ని రూట్లలో నడిపేందుకు 40–50 డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయని వెల్లడించాయిరు. నగరంలో తిరుగుతున్న బస్సుల సంఖ్యను పెంచుతామని తెలిపారు.
కాగా, కార్గో వ్యాపారాన్ని ఇరుగు – పొరుగు రాష్ర్టాల్లోనూ వ్యాప్తి చేసేందుకు టీఎస్ ఆర్టీసీ కార్గో విభాగం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధించిన ఏజెంట్లు ఇటీవల నియామకమయ్యారు.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు