రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుశీల్ మోదీ

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుశీల్ మోదీ

బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ, రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి డివిజనల్ కమిషనర్‌ నుంచి ధ్రువపత్రాన్ని సోమవారం తీసుకున్నారు. 

‘‘రాజ్యసభకు పోటీ లేకుండా ఎన్నికయ్యాను. అనంతరం డివిజనల్ కమిషనర్ నుండి ఎన్నికల ధృవీకరణ పత్రం పొందాను’’ అని తన ట్విట్టర్ ఖాతాలో సుశీల్ కుమార్ మోదీ రాసుకొచ్చారు. గడిచిన ప్రభుత్వంలో నితీష్ కుమార్‌ కేబినేట్‌లో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించిన సుశీల్ కుమార్ మోదీకి కొద్ది రోజుల క్రితం ఏర్పడిన బిహార్ ప్రభుత్వంలో స్థానం లభించలేదు. 

అయితే ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలే వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఆయనను రాజ్యసభకు ఎంపికయ్యేలా చేశారని చెబుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర  మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంకు జరిగిన ఉపఎన్నికలలో మోదీ  ఎన్నికయ్యారు.