రాజకీయ భవిష్యత్ కనిపించకనే ప్రతిపక్షాల నిరసనలు 

తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకరంగా మారడంతోనే నూతన చట్టాల విషయంలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా  ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే చేశారో… దానినే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. 
 
అయితే ఇప్పుడు మాత్రం పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతున్నాయని, అందుకే తమ రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడుతూ నిరసనల్లో పాలుపంచుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 
 
ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని 2019 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందని, అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న ఎగుమతుల ఆంక్షలను ఎత్తేస్తామని కూడా పేర్కొందని ఆయన గుర్తు చేశారు. 
 
 ఈ గతాన్ని కాంగ్రెస్ మరిచిపోయి ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. నూతన చట్టాలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా వ్యతిరేకిస్తున్నారని, కానీ ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్‌లలో మౌలిక సదుపాయాల నిమిత్తం ప్రైవేట్ రంగాన్ని కూడా చేర్చాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారని రవిశంకర్ గుర్తు చేశారు. 
 
తాము నిరసన వ్యక్తం చేసే వేదికలపైకి రాజకీయ నేతలెవ్వరూ రావొద్దని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారని, వారి భావాలను తాము గౌరవిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కానీ నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శించడానికి ఓ వేదిక దొరికింది కాబట్టే… ఈ పోరాటంలో వివిధ పక్షాల నేతలు కూడా వస్తున్నారని ఆయన విమర్శించారు.