టైమ్‌ ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గీతాంజలి రావు

ప్రతిష్ఠాత్మక ‘టైమ్‌’ మ్యాగజైన్‌ తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ విభాగంలో ఇండో-అమెరికన్‌ బాలిక గీతాంజలి రావు (15) సత్తా చాటారు. పోటీలో ఉన్న 5 వేల మందిని తోసిరాజని ఈ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. ఈ మేరకు టైమ్‌ మ్యాగజైన్‌ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. 

కలుషితమైన నీటిని గుర్తించడం నుంచి మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిని రక్షించడం, సైబర్‌ బెదిరింపులు వంటి పలు అంశాలకు  సాంకేతికత సాయంతో గీతాంజలి పరిష్కార మార్గాన్ని చూపారని టైమ్‌ ప్రతినిధులు తెలిపారు. కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్‌ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వీటికి సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపాలని పేర్కొన్నారు.

 గీతాంజలి రావును హాలీవుడ్ యాక్టర్ ఏంజెలీనా జోలీ కొలరాడోలోని తన ఇంటి నుంచి వర్చువల్‌గా ఇంటర్వ్చూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో గీతాంజలి తాను చేసిన పరిశీలన, పరిశోధన, మెదడు ప్రభావం, నిర్మించడం, మరియు కమ్యూనికేట్ చేయడం వంటి వాటి గురించి మాట్లాడింది. అంతేకాకుండా కలుషితమైన తాగునీటి వల్ల ఓపియాడ్‌కు బానిసవ్వడం, సైబర్ బెదిరింపులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కరాలను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా యువ ఆవిష్కర్తలను ఒక్కటి చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది.

తాను ఒక దీన్ని చేయగలిగితే, మిగతా ఎవరైనా దీన్ని చేయగలరని ఆమె తెలిపింది. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించొద్దని.. మిమ్మల్ని ఉత్తేజపరిచే వాటిపైనే దృష్టి పెట్టాలని ఆమె యువ శాస్త్తవేత్తలను కోరింది. తమ తరం పిల్లలు ఇంతకు ముందెన్నడూ చూడని అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని గీతాంజలి చెప్పింది.

‘కొత్త సమస్యలతో పాటు ఇప్పటికీ ఉన్న పాత సమస్యలను కూడా మేం ఎదుర్కొంటున్నాం. మేం ఒక కొత్త గ్లోబల్ మహమ్మారి మధ్యలో ఉన్నాం. అంతేకాకుండా మానవ హక్కుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి వాటిని మేం సృష్టించలేదు. కానీ, వాటికి పరిష్కారం చూపగలం. వాతావరణ మార్పు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ బెదిరింపుల వంటి వాటిని అరికట్టవచ్చు. ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించడానికి నేను స్వంతంగా పరికరాలు తయారుచేయాలనుకుంటున్నాను. మిగతా పిల్లలు కూడా ఇటువంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఎందుకుంటే సొంత అనుభవంతో నేర్చుకున్నది ఎప్పటికీ మరచిపోలేం’ అని గీతాంజలి తెలిపింది.

‘గీతాంజలి రెండు, మూడో తరగతులలో ఉన్నప్పుడే సామాజిక మార్పును సృష్టించడానికి సైన్స్ మరియు టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అని ఆలోచించేది. తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే డెన్వర్ వాటర్ క్వాలిటీ రీసెర్చ్ ల్యాబ్‌లో కార్బన్ నానోట్యూబ్ సెన్సార్ టెక్నాలజీని పరిశోధన చేయాలనుకుంటున్నానని చెప్పింది’ అని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు.