ఇకపై ఎప్పుడైనా నగదు బదిలీ 

ఇకపై  రాత్రీ, పగలు అనే తేడా లేకుండా నిత్యం ఎప్పుడైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్టీజీఎస్‌) నిబంధనలు డిసెంబర్‌ 1 నుంచి మారుతున్నాయి. దీంతో ఆర్టీజీఎస్‌ వ్యవస్థ రోజుకు 24 గంటల చొప్పున వారంలో అన్ని రోజులూ నిరంతరాయంగా పనిచేస్తుంది. 

ఇప్పటివరకూ ఈ సదుపాయం ప్రతి వారంలోని పనిదినాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాల్లో ఆర్టీజీఎస్‌ సేవలను పూర్తిగా నిలిపివేసేవారు. 

కానీ మంగళవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో ఇకపై రూ.2 లక్షలలోపు నగదును వారంలో ఏ రోజైనా, ఏ సమయంలోనైనా బదిలీ చేసుకునేందుకు వీలుంటుంది. 

వీటితోపాటు వంట గ్యాస్‌ సరఫరా, బీమా ప్రీమియం చెల్లింపులు, బ్యాంకింగ్‌ సేవలకు సంబంధించిన నిబంధనల్లోనూ కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయి.  ఏటీఎం నుంచి జరిపే నగదు ఉపసంహరణలపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కొత్త నిబంధనలను అమలు చేయనున్నది.

డిసెంబర్‌ 1 నుంచి 2.0 ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్యలో ఏటీఎం నుంచి రూ.10 వేల కంటే ఎక్కువ నగదును ఉపసంహరించుకోవాలంటే తప్పనిసరిగా ఓటీపీని పొందాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారి దెబ్బతో ఇటీవల చాలా మంది వివిధ రకాల బీమా పాలసీలను తీసుకున్నారు. వీటి ప్రీమియం మొత్తాన్ని సగానికి తగ్గించుకునే వెసులుబాటు మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నది. అంటే ప్రీమియంలో 50 శాతం మొత్తాన్ని చెల్లించి పాలసీని కొనసాగించుకునేందుకు వీలుంటుంది. అయితే మిగిలిన 50 శాతం ప్రీమియంను ఎప్పుడు చెల్లించాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.