
ఎపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ సస్పెండ్ అయ్యారు.
దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తొలుత అసెంబ్లీ శీతాకాల సమావేశం మొదటి రోజున అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు బైఠాయించి తన నిరసన తెలిపారు. తుపాను పంట నష్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇది చోటుచేసుకుంది.
పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది.
అధికార పక్షం తీరుకు నిరసనగా పోడియం ఎదుట చంద్రబాబు బైఠాయించారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని సీఎం హితవు చెప్పారు.
డిసెంబర్ నెలాఖరునాటికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం చెప్పారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదని జగన్మోహన్ రెడ్ది పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని, సభలో దురదృష్టకరమైన పరిణామం నేనెప్పుడూ చూడలేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని, రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.
More Stories
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని
భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు