ఉద్ధవ్ థాకరే బెదిరింపులకు దిగుతున్నారు

ఐదేళ్లు పాలించగలరేమో కానీ, ఇతరులను బెదిరించలేరనీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు. తమ కుటుంబాన్ని, తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోందన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే వ్యాఖ్యలఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వ్యక్తిగత విమర్శలు, దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 
 
 ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనడానికి నటి కంగనా రనౌత్, జర్నలిస్టు అర్నబ్ గోస్వామి ఉదంతాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చర్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టినందున దీనికి ఎవరు క్షమాపణ చెబుతారని ప్రశ్నించారు. ‘ఆయన (థాకరే) చెప్పరు, ఆ విషయం నాకు తెలుసు’ అని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు.
 
అర్నాబ్ గోస్వామి, సినీనటి కంగనా రనౌత్ ల అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే వారి పట్ల మహా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాత్రం తప్పుపడుతున్నామని చెప్పారు. వీరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కోర్టులు కూడా తప్పుపట్టాయని గుర్తు చేశారు.
 
మోదీ పేరుతో ఓట్లు అడిగి, ఆ తర్వాత విపక్షాలతో చేశారని, ఇది వంచనేనని థాకరేపై ఫడ్నవిస్ ఘాటు విమర్శలు గుప్పించారు.  మహా వికాస్ అఘాడి ఏడాది పాలనపై స్పందిస్తూ, కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ‘హిందుత్వ’ నుంచి శివసేన వైదొలిగిందని విమర్శించారు. 
‘మా హిందుత్వం చెక్కు చెదరలేదు. హిందుత్వ నుంచి శివసేనే వైదొలిగింది. సావర్కర్‌పై వాళ్ల భాగస్వామ్యులు ఏమన్నారో శివసేన ఎలా మరిచిపోయింది? చైనా సాయంతో 370వ అధికరణను పునరుద్ధిస్తామని మాట్లాడే గుప్కార్ డిక్లరేషన్‌కు మద్దుతుగా నిలుస్తున్న కాంగ్రెస్‌తో వారు(సేన) చేతులు కలిపారు’ అని ప్రశ్నించారు.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కోవిడ్ సెకెండ్ వేవ్ బారిన మహారాష్ట్ర పడకపోవడం మన అదృష్టమని విమర్శించారు. ‘ఈ వ్యక్తులు కోవిడ్‌ను అదుపు చేశామంటూ నిస్సిగ్గుగా చెబుతున్నారు. దేశంలోని మొత్తం మరణాల్లో 47,000 కోవిడ్ మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి’ అని త్లెలిపారు.
వాళ్లు యుద్ధం చేసింది గణాంకాలతోనే కానీ కోవిడ్‌తో కాదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కోవిడ్ మేనేజిమెంట్‌లో థాకరే ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఫడ్నవిస్ ఆరోపించారు. కోవిడ్ సమయంలో తాను ముఖ్యమంత్రికి పలు లేఖలు రాశానని, ఒక్క దానికి కూడా స్పందించడం కానీ, తన సలహాలను పట్టించుకోవడం కానీ  చేయలేదని ఫడ్నవిస్ ధ్వజమెత్తారు. కోవిడ్ నిర్వహణలో చోటుచేసుకున్న అవినీతిని బహిర్గతం చేస్తామని చెప్పారు.