జీహెచ్ఎంసీ పీఠం బీజేపీ సొంతం

జీహెచ్ఎంసీ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీలో చేరిన   టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ భరోసా వ్యక్తం చేశారు. 
 
 `బీజేపీలో చేరడం తిరిగి నా మాతృసంస్థకు వచ్చినట్లు ఉంది. నా ఇంటికి తిరిగి చేరానని భావిస్తున్నాను. ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలో చేరలేదు’ అని ఈ సందర్భంగా చెప్పారు. పైగా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
స్వామిగౌడ్‌కు జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు.  సీఎం కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్న స్వామీగౌడ్ గత కొద్దిరోజులుగా గులాబీ దళంపై గుర్రుగా ఉన్నారు
 
 తెలంగాణ కోసం ఒక్క నాడు కూడా పోరాడని వారికి టీఆర్ఎస్‌లో పదవులు ఇచ్చారని స్వామి గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారని మండిపడ్డారు. తండ్రిలాంటి కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు అలసత్వం వహించారో అర్థం కాలేదని విస్మయం వ్యక్తం విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఉద్యమకారులు కనీస మర్యాదలకు నోచుకోలేరా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులను ఎండన నిలబెట్టి.. పోరాడని వారికి మాత్రం గొడుగు పట్టారని ఆరోపించారు. రెండేళ్ల నుంచి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించా. తనకు  ఇంతవరకు అపాయింట్‌మెంట్ దొరకలేదని వాపోయారు.
ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరానని స్వామి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పార్టీ మార్పు అని తెలిపారు. చాలా మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లభించడం లేనిపేర్కొన్నారు .