టిఆర్‌ఎస్ గెలుపు కోసమే టిడిపి పోటీ చేస్తుందా! 

జిహెచ్‌ఎంసి ఎన్నికల గురించి మొదటి నుంచి దాదాపు మౌనంగా ఉంటూ వచ్చిన టిడిపి చివరిలో భారీ పోటీ  చేస్తుండడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది. అందరూ భావిస్తున్నల్టు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడం కోసం  కాదని,  అధికార పక్షం వ్యక్తిరేక ఓట్లను చీల్చడం ద్వారా టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించడం ద్వారే అని సర్వత్రా భావిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రం  ఏర్పాటు తర్వాత ఏ ఎన్నికల్లోనూ కనీసం 5 శాతం ఓట్లు సాధించలేని టిడిపి ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో దాదాపుగా అన్ని వార్డుల్లో అభ్యర్థుల్ని పోటీలో నిలిపింది. పాత బస్తీతో సహా నగరం అంతటా పోటీ చేస్తున్నది. అధికారికంగా 90 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించినా అనేక చోట్ల ఆ పార్టీ నేతలు నామినేషన్లు వేశారు. 

2018 సాధారణ ఎన్నికల్లోనూ టిడిపికి 3.5 శాతం ఓట్లు, అంటే 7 లక్షల చిల్లర ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలో ఆ పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలే కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో టిడిపి నుంచి ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో 206 నామినేషన్లు రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

గ్రేటర్‌ ఎన్నికల్లో టిడిపి బరిలో ఉన్న వార్డుల్లో అధికార టిఆర్‌ఎస్‌కు మేలు చేకూర్చడమే ఎత్తుగడగా కనిపిస్తున్నది. టిఆర్‌ఎస్ కంచుకోటగా భావిస్తున్న దుబ్బాక ఉపఎన్నికలలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ఎన్ రఘునందనరావు గెలుపొందడంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపి గాలి వేస్తున్నది. అధికార పక్షానికి బీజేపీ మాత్రమే కొరకరాని  కొయ్యగా మారింది.

ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లు బిజెపి వైపు మళ్లకుండా కట్టడి చేయడం కోసమే టిడిపి పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. పైగా  టిడిపికి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్న డివిజన్లలో టిడిపి నుంచి పోటీచేసిన వారిలో బలమైన నాయకులు లేరు.

ఏమాత్రం పట్టులేని పాత బస్తీలో సైతం టిడిపి పోటీలో ఉంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి కొంతమంది తప్పుకున్నా వందకు పైగా డివిజన్ లలో టిడిపి పోటీలో ఉండే అవకాశం ఉంది.

ఎపికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలైన కెపిహెచ్‌బిలో 4, కూకట్‌పల్లిలో 12, మూసాపేటలో 5, శేరిలింగంపల్లిలో 4, యూసఫ్‌ గూడలో 6, మల్కాజిగిరిలో 14, చందానగర్‌లో 7, ఉప్పల్‌లో 7, హయత్‌ నగర్‌లో 8, ఎల్‌బి నగర్‌ సర్కిళ్లలో 6 నామినేషన్లు టిడిపి నుంచి దాఖలయ్యాయి.

పాతబస్తీలోని సంతోష్‌ నగర్‌, ఫలక్‌ నుమా, కార్వాన్‌ నుంచి 5కు మించి దాఖలయ్యాయి. గోశామహల్‌ నుంచి 12, ఖైరతాబాద్‌ 10, జూబ్లీహిల్స్‌ నుంచి 7 టిడిపి నుంచి వచ్చాయి. కేవలం బిజెపి అభ్యర్థులను ఓడించి, టిఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా టిడిపి అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్లు వెల్లడి అవుతున్నది.