టీఆర్ఎస్ కు తిరుగుబాటు అభ్యర్థుల బెడద!  

దుబ్బాకలో ఓటమి అనంతరం  జరుగనున్న   జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఆందోళన కలిగిస్తున్నది.  పార్టీ సీట్ దక్కదనే అనుమానం ఉన్నవారు స్వతంత్రంగా పోటీ చేయడానికో, బీజేపీఐలో చేరడానికో సిద్ధం అవుతూ ఉండడంతో ఖంగారు పడుతున్నారు. 

దీంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు రెబల్స్, అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది.బుధవారం తెలంగాణ భవన్ లో జరుగనున్న పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను ఎన్నికల ఇన్​చార్జీలకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు.

మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. వివాదం లేని చోట నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్తున్నట్టు తెలిసింది. పనితీరు సరిగా లేని, వివాదాలున్న 25 నుంచి 30 మంది సిట్టింగ్ లను తప్పించి మిగతా చోట్ల పాత వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

వివాదం లేని డివిజన్ల అభ్యర్థుల పేర్లను బుధవారం లేదా గురువారం ప్రకటించవచ్చని చెబుతున్నారు. వివాదం ఉన్న చోట్ల నామినేషన్ల పరిశీలన రోజున బీ– ఫామ్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది.  కాగా,టికెట్ దక్కని వారు బీజేపీలో చేరుతారనే భయం టీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.

ఒక్కో డివిజన్​లో టికెట్ కోసం నలుగురి నుంచి 10 మంది వరకు పోటీ పడుతున్నారు. టికెట్ దక్కకపోతే బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని ఓడించాలని పట్టుదల అత్యధికులలో కనిపిస్తూ ఉండడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నది.

దుబ్బాక ఓటమి అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు పార్టీకి కీలకం కానున్నాయి. మళ్ళి బిజెపి గెలుపొందితే రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకరం కాగలదని భయం వారిని వెంటాడుతున్నది. పైగా, దాదాపు సగం మంది పార్టీ కార్పొరేటర్ల పైన ప్రజలలో తీవ్ర వ్యతిరేకంగా ఉన్నట్లు పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడి చేయడం మరింత చికాకు కలిగిస్తున్నది.