కారుకు ఓటు వేస్తే.. ఎంఐఎంకు వేసినట్లే 

కారుకు ఓటు వేస్తే.. ఎంఐఎంకు వేసినట్లే అని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను హెచ్చరించారు.  ఎందుకంటే టీఆర్ఎస్ కారు స్టీరింగ్ అసదుద్ధీన్ చేతిలో ఉందని గుర్తు చేశారు. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎ రాజాసింగ్, ఎంఎల్‌సి రాంచందర్‌రావు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు రఘునందన్ రావు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నాహాలపై బిజెపి నిర్వహించిన సమావేశంలో పాల్గొంటూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సైతం దుబ్బాక తీర్పును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య తాను దుబ్బాక నియోజకవర్గాన్ని గెలవటం చిన్న విషయం కాదని పేర్కొన్నారు. ఉద్యమాల గడ్డపై జైశ్రీరాం నినాదాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  గ్రేటర్ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ గులాబీ యూనిఫాం వేసుకున్న పోలీసులను తప్పక నిలదీస్తామని  హెచ్చరించారు. ” ప్రస్తుతం మేము చీకటిలో ఉండొచ్చు… చీకట్లు పోయి వెలుతురులోకి వస్తాం.. తప్పు చేస్తున్న పోలీస్ అధికారులకు శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి” అని హితవు చెప్పారు. పోలీస్ కమిషనర్లు చట్టాలకు అతీతం  కాదని స్పష్టం చేశారు. 

కాగా, ఎన్నికల్లో కారును షెడ్ కు పంపిస్తే… సారు, కారు, సర్కారు ఇక రారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో ఏమీ జరగబోతోందో దేశం మొత్తం చూస్తుందని చెప్పారు. కేసీఆర్ నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో ప్రజలు బీజేపీని గెలిపించారని కొనియాడారు.

గోల్కొండ లో పదివేల ఆర్థిక సహాయం కోసం లైన్లో నిలబడి ఓ మహిళ చనిపోయారని చెబుతూ  కేసీఆర్ హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించారని ఆరోపించారు. 80శాతం ఉన్న హిందువుల హక్కుల కోసం బీజేపీ పని చేస్తోందని వెల్లడించాయిరు. దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు.

దేశ ద్రోహుల పార్టీతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ నేనే గొప్ప హిందువునని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.కాగా, బీజేపీలో చేరిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారీ రూప కల్పనకు సమస్యలు,సలహాల,సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాల్ సెంటర్ కు వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు.