జమ్ముక‌శ్మీర్‌ కూటమి ‘అపవిత్ర ఘట్‌బంధన్’  

జమ్ముక‌శ్మీర్‌ కూటమి ‘అపవిత్ర ఘట్‌బంధన్’  

జమ్ముక‌శ్మీర్‌లో కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌ (పీఏజీడీ) అపవిత్ర కూటమి కానీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌ విషయంలో గుప్కార్ కూట‌మి బయటి శక్తుల జోక్యాన్ని కోరుతున్న‌ద‌ని ఆయన విమ‌ర్శించారు.

జాతి ప్రయోజనాలకు విరుద్ధ‌మైన‌ అలాంటి ‘అపవిత్ర ఘట్‌బంధన్’ను ప్రజలు ఎంతోకాలం ఉపేక్షించరని హెచ్చరించారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని అవమానించిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా..? అని కాంగ్రెస్  అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీని అమిత్‌షా ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

‘గుప్కార్ గ్యాంగు గ్లోబల్‌ తలుపులు తట్టాలనుకుంటోంది. జ‌మ్ముక‌శ్మీర్‌‌లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. గుప్కార్ గ్యాంగు భారత త్రివర్ణ పతాకాన్ని కూడా అవమానిస్తున్న‌ది’ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. 

గుప్కార్ గ్యాంగ్ చర్యలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మద్దతిస్తారా..? వారి వైఖరి ఏమిటో దేశ ప్రజలకు స్పష్టం చేయాలని అమిత్‌షా ట్విట్ట‌ర్‌లో డిమాండ్ చేశారు. కాంగ్రెస్, గుప్కార్ గ్యాంగ్ తిరిగి జమ్ముక‌శ్మీర్‌ను ఉగ్రవాద భయాలు, కల్లోల శకంలోకి నెట్టివేయాలని అనుకుంటున్నట్టు అమిత్‌షా ఆరోపించారు.