ఆల్ ఖైదా కీలక నేత మస్రీ కాల్చివేత 

ప్రపంచంలోనే కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదాకు   కాబోయే అతి, అత్యంధిపత కీలక నేత, సంస్థలో నంబర్‌ టూగా పేరొందిన  అబూ మొహమ్మద్‌ అల్‌ మస్రీని, ఆయన కుమార్తె మిరియమ్‌ను అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో కాల్చిచంపాయి.

మరియమ్‌ మస్రీ అల్‌కాయిదా వ్యవస్థాపకుడైన ఒసామా బిన్‌ లాడెన్‌కు కోడలు. ఆమె భర్త హమ్‌జా లాడెన్‌ను అమెరికా నిరుడు హతమార్చింది. ఈ హత్యలు ఈ ఏడాది ఆగస్టులో ఇరాన్‌ ఉత్తరప్రాంతంలోని ఓ పట్టణంలో జరిగాయి. 

వీరిద్దరూ కార్లో వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి చంపేశారు. మిస్రీకి కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా చేరవేయగా, ఇజ్రాయెల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌కు చెందిన కమాండో యూనిట్‌ కిడాన్‌కు చెందిన ఏజెంట్లు ఆయనను వేటాడి వెంటాడి హత్యచేశారు. 

తొలుత ఈ చనిపోయినది లెబనాన్‌కు చెందిన హబీబ్‌ దావూద్‌ అనే విద్యావేత్త అని ఇరాన్‌ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఆ తరువాత సోషల్‌మీడియాలో అల్‌ ఖైదా నేత అని వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరకు అక్టోబరు చివరివారంలో ఆ మరణించినది మస్రీ అని, లాడెన్‌ కోడలు అనీ అమెరికా నిఘా సంస్థల అధికారులు ధ్రువీకరించారు. 

ఈజి్‌ప్టకు చెందిన ఈ 58 ఏళ్ల మస్రీ- అసలు పేరు అబ్దుల్లా మొహమ్మద్‌ అబ్దుల్లా.. ఈయన అల్‌ ఖైదాలో వ్యూహరచనా నిపుణుడిగా పేరు. నైరోబీ, దారుస్సలాంలోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998 ఆగస్టు 7న బాంబు దాడులతో పాటు అనేక ఉగ్రవాద దాడుల వెనుక ఆయన హస్తమున్నట్లు ఎఫ్‌బీఐ, సీఐఏ వెల్లడించాయి.

లాడెన్‌ మరణం తరువాత సంస్థ కార్యకలాపాలు చూసిన అయమాన్‌ అల్‌ జవహిరి రెండేళ్ల కిందటి నుంచి అనారోగ్యంతో మంచం పట్టినట్లు, కేవలం కొన్ని వీడియో సందేశాలకు మాత్రమే పరిమితమైనట్లు వార్తలొచ్చాయి. ఆయన వారసుడే అబూ అల్‌ మస్రీ అని అమెరికా, ఇజ్రాయెలీ నిఘా సంస్థలు పేర్కొన్నాయి.

ఈయనను చంపినా, ఆచూకీ తెలిపినా 10 మిలియన్‌ డాలర్ల బహుమతినిస్తామని అమెరికా గతంలోనే ప్రకటించింది. లాడెన్‌ను అబోటాబాద్‌లో కడతేర్చిన తరువాత, అఫ్గానిస్థాన్‌ నుంచి ఈ సంస్థకు చెందిన అగ్రనేతలు సిరియా, ఇరాన్‌, ఇరాక్‌లకు పారిపోయారు.

సెప్టెంబరు 11 దాడుల తరువాత- మస్రీ ఇరాన్‌లోనే గృహనిర్బంధంలో ఉన్నారు. ఒక దశలో ఇరాన్‌ సర్కార్‌ ఆయనను ఈజి్‌ప్టకు వెళ్లిపోవాల్సిందిగా మస్రీని కోరినా ఆయన అందుకు తిరస్కరించారు. అనేకమంది అల్‌ ఖైదా ఉగ్రవాదులతో పాటు ఒకే కాంపౌండ్‌లో ఆయన ఉండిపోయారు.

ఆ సమయంలోనే అక్కడే ఆయన కుమార్తె మిరియం, హమ్‌జా బిన్‌ వివాహం చేసుకున్నట్లు, అందుకు సంబంధించిన వీడియో లాడెన్‌కు పంపినట్లు తేలింది. లాడెన్‌ను అమెరికన్‌ దళాలు చంపేశాక ఆ వీడియో కేసెట్‌ను అక్కడినుంచి స్వాధీనపరుచుకున్నారు.

నైరోబీ బాంబింగ్‌ జరిగిన తేదీ నాడే- అంటే ఆగస్టు 7వ తేదీనే మిస్రీ హత్య జరగడం విశేషం. అంతేకాక, లెబనాన్‌ పోర్టులో భారీ విస్ఫోటనం సంభవించిన మూడురోజుల తరువాత మిస్రీని కడతేర్చారు. లెబనాన్‌ మండిపోతున్న దశలో ఇది జరగడం వల్ల దీనిని ఎవరూ పట్టించుకోలేదు.  మిస్రీ హత్య ఆల్ ఖైదాకు తీవ్రమైన దెబ్బ అని అమెరికా వ్యాఖ్యానించింది.

ఈ హత్య డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షపదవి ముగుస్తున్న సమయంలో జరగడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో తిరిగి శాంతి చర్చలు నెరిపి ఒప్పందంలో తిరిగి చేరాలని భావిస్తున్న తదుపరి అధ్యక్షుడు జో బైడెన్‌ ముందరికాళ్లకు ఈ ఘటన బంధనాలు వేస్తోంది. అల్‌ ఖైదా నేతలను ఇరాన్‌ పెంచిపోషిస్తున్నదని, అటువంటి దేశంతో శాంతిచర్చలు జరపడమేంటని ఇజ్రాయెల్‌ ప్రశ్నించే అవకాశం ఉందని, ఇది ఇజ్రాయెల్‌-అమెరికా సంబంధాలను కూడా దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు.