బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంచార్జిగా భూపేందర్ యాదవ్

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి  సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు తర్వలో  జరుగనున్న  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. 

జీహెచ్ఎంసీ ఎట్లాగైనా విజయం సాధించడం ద్వారా తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలబడేందుకు పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ను రంగంలోకి దింపుతున్నది. కీలకమైన బీహార్, గుజరాత్ రాష్ట్రాలలో బిజెపి ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఆయన బీహార్ లో ఇటీవల ఎన్డీయే గెలుపొందడంతో కీలక పాత్ర వహించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ జాతీయస్థాయిలో సంసిద్ధమవుతున్నట్లు ఇవాళ ప్రకటించిన రెండు కమిటీలే స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం. జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు.

భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి కో-కన్వీనర్‌గా కర్ణాటక విద్యా మంత్రి డా.సుధాకర్, మహారాష్ట్రకు చెందిన అశీష్ షెల్లార్, గుజరాత్‌కు చెందిన ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్ణాటక బీజేపీ కార్యదర్శి, ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలను సభ్యులుగాను ఒక ప్రత్యేక కమిటీని నియమించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మేనేజ్‌మెంట్ కమిటీ వేసిన బీజేపీ అధినాయకత్వం దానికి ఛైర్మెన్‌గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డిని, కన్వీనర్‌గా బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ ఛైర్మెన్ డా. కే.లక్ష్మణ్‌ను, కో కన్వినర్‌గా మాజీ ఎంపీ వివేక్‌ వెంకట స్వామి, ఎన్నికల ఇంఛార్జీలుగా గరికపాటి నరసింహారావు, చింతల రామచంద్రారెడ్డిలను నియమించారు.