నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సైన్యం ఉల్లంఘిస్తోంది. సామాన్యులు నివసించే ప్రాంతాలపై కూడా ఇష్టానుసారం కాల్పులు జరుపుతోంది.
శుక్రవారం పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులు కాగా, ముగ్గురు సామాన్యులు అసువులుబాశారు. జమ్మూ-కశ్మీరులోని గురేజ్ సెక్టర్ నుంచి ఉరి సెక్టర్ వరకు జరిగిన కాల్పుల్లో ఈ దారుణాలు జరిగాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ దళాల కాల్పుల్లో ఉరి సెక్టర్‌లో ఇద్దరు భారత సైనికులు, హాజీ పీర్ సెక్టర్‌లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేశ్ దోవల్ అమరులయ్యారు. ఉరి సెక్టర్‌లోని కమల్‌కోట్‌లో ఇద్దరు సాధారణ పౌరులు, బాల్‌కోట్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు.
రక్షణ శాఖ అధికార ప్రతినిథి తెలిపిన వివరాల ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్ల కోసం పాకిస్థాన్ దళాలు ప్రయత్నించాయి. దీనిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. బందిపొర జిల్లాలోని గురేజ్, కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టర్లలో పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయి.
పాకిస్థాన్ దళాలు కేరన్ సెక్టర్‌లో మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ దళాల దుశ్చర్యలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు.
ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన చొరబాటు యత్నాలను తిప్పికొట్టి, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాది ప్రారంభం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన సంఘటనలు దాదాపు 3,800 నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
More Stories
నీట్ పేపర్ లీకేజ్లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర