బీహార్ ఫలితాలతో తమిళనాడు కాంగ్రెస్ కు చిక్కులు 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు తేజస్వి యాదవ్ కు అరిష్టంగా మారినట్లు ఫలితాలు సూచిస్తూ ఉండడంతో త్వరలో ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు చిక్కులు ఏర్పడుతున్నాయి. గతంలో వలే ఎక్కువ సీట్లకు డిమాండ్ చేయలేని, డీఎంకే ఇచ్చిన కొద్దిపాటు సీట్లకు సర్దుకు పోవలసిన పరిస్థితులు కాంగ్రెస్ కు ఇక్కడ ఎర్పడుతున్నాయి. 
బిహార్‌లో ఆర్జేడీ కూటమిలోని కాంగ్రెస్‌ 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి 19 చోట్ల మాత్రమే గెలిచింది. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఓటమి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆర్జేడీ ఆశలను అడియాసలు చేసింది. ఈ పరిస్థితి తమిళనాట ఏర్పడ కూడదని డీఎంకే అధిష్ఠానం భావిస్తున్నది. 
 
2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీకి ఎదురైన పరిస్థితే డీఎంకేకు ఎదురైంది. డీఎంకే కాంగ్రెస్‌ పార్టీకి 40 సీట్లు కేటాయించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎనిమిది చోట్ల మాత్రమే గెలిచింది. ఈ కారణంగా డీఎంకే 90 స్థానాలలో గెలిచినా కాంగ్రెస్‌ ఘోరపరాజయం కారణంగా మెజారిటీ లేక అధికారానికి దూరమైంది.
ఈ అంశాన్ని పరిగణనలోకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 20 సీట్లు మాత్రమే కేటాయించాలని డీఎంకే సీనియర్లు నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కు స్పష్టం చేశారు. ఎట్టిపరి స్థితుల్లోనూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు 40 సీట్లు కేటా యించకూడదని కూడా గట్టిగా చెబుతున్నారు.
గతేడాది 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకే 13 స్థానాల్లో మాత్రమే గెలిచిందని, మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు నుంచి డీఎంకే అభ్యర్థులకు ఓట్లు పడలేదని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో 15 సీట్లలో డీఎంకే గెలిచి వుంటే అన్నాడీఎంకే ప్రభుత్వం మెజారిటీ లేక పతనమై, డీఎంకే అధికారంలోకి వచ్చి వుండేదని డీఎంకే సీనియర్‌ నాయకులు తెలిపారు.