వైద్యరంగంలో కీలక పాత్ర పోషిస్తున్నఆయుర్వేదం 

ఈ రోజుల్లో అన్నీ ఏకీకృతమవుతుండటంతో వైద్య రంగంలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చెబుతూ ఆయుర్వేదం సామరస్యంగా సాగుతున్నట్లు తెలిపారు. ప్రాచీన భారత దేశ శాస్త్రాన్ని 21వ శతాబ్దపు సైన్స్‌తో జోడించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. 

ఆయుర్వేద దినోత్సవాల సందర్భంగా రెండు ఆయుర్వేద సంస్థలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. జామ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదను, జైపూర్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అల్లోపతి, ఆయుర్వేదం కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మన దేశపు ప్రాచీన శాస్త్రాన్ని 21వ శతాబ్దపు సైన్స్‌తో జోడిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి వల్ల వైద్య రంగంలో ఆయుర్వేదం ముఖ్య పాత్ర పోషించే అవకాశం కలిగిందని తెలిపారు.

ఈ రెండు సంస్థలు మన దేశంలో అత్యున్నత స్థాయి ఆయుర్వేద కేంద్రాలని చెబుతూ  అంతర్జాతీయ స్థాయి పాఠ్యాంశాలను రూపొందించే బాధ్యతను స్వీకరించాలని ఈ సంస్థలను కోరారు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని చెప్పారు.

 మన దేశ జనాభా ఎక్కువ అయినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి నియంత్రణలో ఉందని గుర్తు చేశారు. దీనికి కారణం ప్రతి కుటుంబం పసుపు కలిపిన పాలు, అశ్వగంధ వంటివాటిని ఉపయోగించడమేనని తెలిపారు. ఇటువంటి ఆయుర్వేద ఉత్పత్తులకు కోవిడ్ మహమ్మారి సమయంలో గిరాకీ పెరిగిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు. ధన్వంతరి జయంతి (ధన్‌తేరాస్) సందర్భంగా ఆయుర్వేద దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 2016 నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

జామ్‌న‌గ‌ర్‌లోని గుజ‌రాత్ ఆయుర్వేద యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఏర్పాటుచేసిన ఐటీఆర్ఏలో 12 డిపార్టుమెంట్లు, మూడు క్లినిక‌ల్ ల్యాబ్‌లు, మ‌రో మూడు ప‌రిశోధ‌క ల్యాబ్‌లు ఉన్నాయి. ఇక్క‌డ సంప్ర‌దాయ వైద్యంలో ప‌రిశోధ‌న‌లు జ‌రుతున్నాయి. ప్ర‌స్తుతం అందులో 33 రిసెర్చ్ ప్రాజెక్టులు న‌డుస్తున్నాయి. దీనిని మొద‌ట్లో ఐఎన్ఐ అని పిలిచేవారు. దాని పేరును ఐటీఆర్ఏగా మార్పుచేశారు.

జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్ఐఏకు యూజీసీ డీమ్డ్ యూనివ‌ర్సిటీ హోదా క‌ల్పించింది. అందులో 54 డిపార్టుమెంట్లు ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో స‌ర్టిఫికెట్ కోర్సుల నుంచి పీహెచ్‌డీ కోర్సుల వ‌ర‌కు అందిస్తున్న‌ది. వివిధ ప‌రిశోధ‌క కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు.