ఉద్ధవ్ సర్కార్ దానంతటదే కూలుతుంది

ఉద్ధవ్ సర్కార్ దానంతటదే కూలుతుంది

మహారాష్ట్రలో  తామేమీ మార్పు కోవడం లేదని, అయితే ఉద్ధవ్ సర్కార్ దానంతటదే కుప్ప కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అటువంటప్పుడు  ఉద్ధవ్‌కు ఓ ప్రత్యామ్నాయంగా మాత్రం నిలుస్తామని తేల్చి చెప్పారు.

 ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనజాలవని, ప్రభుత్వం పడిపోగానే ఓ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తామందిస్తామని ఆయన ప్రకటించారు. అయితే తమ ప్రాధాన్యం మాత్రం అది కాదని, మహారాష్ట్రలో ప్రజలు చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వాటిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. 

రైతులు పరిస్థితి దుర్భరంగా ఉందని, అయినా సరే… ప్రభుత్వం ఏమాత్రం ఆర్థిక సహాయం అందించడం లేదని మండిపడ్డారు. ఓ విపక్ష పార్టీగా తాము ప్రజలతో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. 

బిహార్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని, ముఖ్యంగా బెంగాల్‌పై వీటి ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు.