ఈవీఎంలపై మరోసారి కాంగ్రెస్ రగడ  

బీహార్‌లో కౌంటింగ్ మొదలైన కొద్ది గంటలకే ఎన్డీయే ఆధిక్యాల పరంగా మెజారిటీ మార్క్‌ను దాటడంతో కాంగ్రెస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఈవీఎంలపై మరోసారి రగడ సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. 
 
భూమిపై నుంచే పరికరాలతో అంగారకుడు, చంద్రుడి దశాదిశలను నిర్దేశిస్తుంటే ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేరని  అంటూ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఓ ట్వీట్‌లో ఓటమిని ఒప్పుకోలేక పేర్కొన్నారు. 
 
కాగా, కౌంటింగ్ తొలి ట్రెండ్స్‌లో తేజస్వి యాదవ్ సారథ్యంలోని ‘మహాఘట్ బంధన్’ ఆధిక్యాల పరంగా ముందంజలో ఉండగా, క్రమంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి పుంజుకుంటూ మెజారిటీ మార్క్‌ వైపు దూసుకెళ్లింది. 
 
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి ఎన్డీయే 132 సీట్లలోనూ, మహాఘట్ బంధన్ 99 సీట్లలోనూ, ఎల్‌జేపీ 2, ఇతరులు 9 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. 76 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తూ  రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలను మెరుగుపరుచుకొంది. 
 
ఆర్జేడీ 62 సీట్లలో రెండో స్థానంలో, జేడీయూ 51 సీట్ల అధిక్యంతో మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్‌ ఆశించిన ఫలితాలు రాబట్టడంలో మరోసారి చతికిలపడింది.