జగన్‌ లేఖ న్యాయవ్యవస్థ పనితీరులో జోక్యమే   

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాసి.. అందులోని అంశాలను మీడియాకు వెల్లడించడం  న్యాయవ్యవస్థ పనితీరులో జోక్యం కిందే పరిగణించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం స్పష్టం చేసింది.  ఈ లేఖ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ది. ఆ లేఖరాసి ఇప్పటికే నెల రోజులు దాటిపోయినందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. 
 
ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమని తేలితే కఠినమైన చర్యలు తీసుకోవాలనిసంఘం అధ్యక్షుడు సురేంద్రనాథ్‌, ప్రధాన కార్యదర్శి బికాస్‌ రంజన్‌ భట్టాచార్య విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, జవాబుదారీ  విధానానికి తీరని నష్టం జరిగిందని పేర్కొంటూ దీనిని నివారించాల్సిన బాధ్యత ప్రధాన న్యాయమూర్తిపైనే ఉన్నదని వారు స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో జరిగిన ఈ కొత్త పరిణామాలపై న్యాయవ్యవస్థకు బాధ్యులైనవారంతా అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపిచ్చారు. జగన్‌ లేఖను భారత దేశ చరిత్రలోనే అసాధారణమైనదిగా సంఘం పేర్కొంది.
హైకోర్టు న్యాయమూర్తులను ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌, సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా దూషిస్తూ అధికారంలో ఉన్న వారు సహా పలువురు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తన పిటిషన్‌ను తానే విచారించడం,  రిజిస్ట్రార్‌ లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం అసాధారణ పరిణామాలుగా ఆందోళన వ్యక్తం చేశారు.
వీటిపై ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేస్తూ  ఈ మొత్తం పరిణామాలు భయోత్పాతం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, దానిని అధికారికంగా బహిర్గతం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చర్యలను కోరుతూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.
న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌, యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు మరో న్యాయవాది సునీల్‌ కుమార్‌ సింగ్‌ వేర్వేరుగా మూడు పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌ల ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది.