బెయిల్ రాక నిరాశలో లాలూ ప్రసాద్ 

ఈ నెల 10న జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తన కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆ లోపుగా తాను బెయిల్ పై విడుదలై, ఆ సంబరాలలో పాల్గొనబోతున్నానని ఆశగా ఎదురు చూస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు నిరాశే ఎదురైనది.

డుమ్కా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ బెయిల్ కోసం చేసిన అభ్యర్థనపై విచారణను జార్ఖాండ్ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి చైబసా ట్రెజరీ కేసులో లాలూకు ఇటీవల బెయిల్ లభించింది. 

అయితే, డుమ్కా ట్రెజరీ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ఆయన జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది.  పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1990లో బిహార్ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. 

సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో 2017 డిసెంబరులో దోషిగా తేలడంతో శిక్ష ఖరారైంది. నాటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయనను బయటకు తీసుకురావాలనే ప్రయత్నం జరిగినప్పటికీ ఆయన లేకుండానే ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్నాయి. 

ఎన్నికల కౌంటింగ్ ముందు లాలూ వస్తారంటూ ఆర్జేడీ నేతలు చెప్పినప్పటికీ ఆ అవకాశాలకు ఇప్పుడు తెరపడినట్లయింది. కనీసం ఈ నెల 27 వరకు బెయిల్ లభించే అవకాశం లేదని స్పష్టమైనది.