వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో బిజెపి విజయం ఖాయం 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో బిజెపిదే విజయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి మూడింట రెండొంతుల మెజార్టీ సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పతనం తథ్యమని ఆయన చెప్పారు. 

రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన  బంకురాలో గురువారం నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు.  గిరిజన స్వాతంత్య్ర  సమరయోధుడు బిర్సా ముండా విగ్రహం వద్ద అమిత్ షా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ టిఎంసి బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.  టిఎంసి దారుణాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని ఆయన హెచ్చరించారు. బెంగాల్ లో పేదిరకం, నిరుద్యోగం తాండవిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. పేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న 80కి పైగా పథకాలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి  రాష్ట్రంలో నిషేథించారని ఆయన ఆరోపించారు.

‘గత రాత్రి  నుంచి నేను పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాను. ఎక్కడికి వెళ్లినా మమతా సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాలనలో రాష్ట్రంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగాయి. కేంద్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను అందరికి అందనివ్వకుండా ఆమె అడ్డుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని  కుడా మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆయన విమర్శించారు.

పేదల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన  పథకాలను అడ్డుకోవడం ద్వారా బీజేపీని అడ్డుకోగలమని మమతా భావిస్తున్నారని, కానీ అది అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి అధికారం అప్పగిస్తే బంగారు బంగ్లాను తాయరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ  నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని  ఆయన స్పష్టం చేశారు. గురువారం ఓ గిరిజనుడి ఇంట్లో అమిత్ షా భోజనం చేశారు. శుక్రవారం బిజెపికి మద్ధతు ఇస్తున్న శరణార్థుల ఇంట్లో ఆయన భోజనం చేస్తారు.