‘లవ్ జీహాద్’కు వ్యతిరేకంగా కర్ణాటకలోనూ చట్టం  

పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ ఓ చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నామని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి వెల్లడించారు.   రాష్ట్రంలో యువతుల గౌరవ, మర్యాదలను జీహాదీలు దెబ్బతీస్తూ ఉంటే ప్రభుత్వం మౌనంగా ఉండబోదని స్పష్టం చేశారు.

‘లవ్ జీహాద్’కు వ్యతిరేకంగా, పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకొస్తామని ఇటీవలే ఉత్తర ప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పులో కూడా పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడం చట్టవిరుద్ధమని చెప్పింది. 

సీటీ రవి ఇచ్చిన ట్వీట్‌లో, అలహాబాద్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడాన్ని నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. తమ సోదరీమణుల గౌరవ, మర్యాదలను జీహాదీలు దెబ్బతీస్తూ ఉంటే తాము మౌనంగా ఉండబోమని చెప్పారు. మత మార్పిడికి కారకులయ్యేవారు కఠిన చర్యలను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు.